
నూజెండ్ల రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోండి
రైతులు, ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
నరసరావుపేట: ప్రభుత్వం పేద రైతులకు ఇచ్చిన భూముల నుంచి వారిని బలవంతంగా ఖాళీ చేయించే నూజెండ్ల రెవెన్యూ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ భూములకు చెందిన రైతులు, ప్రజాసంఘాల నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం(పీడీఎం) రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నూజెండ్ల మండలం ముక్కెళ్లపాడులో సర్వేనెంబర్ 783, 784లలో గతంలో పేదలకు డీకే పట్టాలు, బీ ఫారం పట్టాలు పంపిణీ చేశారన్నారు. నాటి నుంచి నేటి వరకు అవి సాగుచేసుకుని వారు జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఈ భూములను మిలటరీ వాళ్లకు కేటాయించారని, వారికి భూమి చూపించడానికి మేము వచ్చామంటూ మీ దగ్గర కాగితాలు తహసీల్దార్‌కు చూపించాలని, వారికి పోను మిగతా భూమిలో ఖాళీ ఎక్కడుంటే అక్కడ మీకు కేటాయిస్తారని, భూమి తీసుకునే వాళ్లు మీకు పొక్లెయిన్‌తో బాగుచేసి ఇస్తారంటూ ముక్కెళ్లపాడు వీఆర్వో బాలకిషోర్ రైతులతో చెప్పారన్నారు. అయితే రైతులు మాత్రం ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని వదిలి ఎక్కడకు పోమని, ఇక్కడే ఉంటామని తెలియచేశారన్నారు. తహసీల్దార్, రైతులను బలవంతంగా రైతులను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తాము నూజెండ్ల రెవెన్యూ అధికారులపై విచారణ నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఇచ్చిన అర్జీపై ఆర్డీఓతో విచారణ చేయిస్తామని కలెక్టర్ కార్యాలయ ఏఓ హామీ ఇచ్చారన్నారు. రైతులు శివాజీ రామంజి, హనుమంతరావు, మారుతీరావు, అరుణ్ కుమార్, సుహాసిని, ప్రసన్న, భవాని, పీడీఎం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ మస్తాన్‌వలి, జి.రామకృష్ణ, బీసీ నాయకులు బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.