
వినియోగదారుల హక్కులు కాపాడాలి
సత్తెనపల్లి: మార్కెట్‌లో వినియోగదారులకు విక్రయించే ప్రతి వస్తువుపై పక్కా సమాచారం ఉండాలని తూనికలు, కొలతలు శాఖ పల్నాడు జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ నల్లబోతుల అల్లూరయ్య అన్నారు. స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కల్యాణ మండపంలో తూనికలు, కొలతల శాఖ వారోత్సవాల్లో అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. అల్లూరయ్య మాట్లాడుతూ వినియోగదారులకు విక్రయించే ప్రతి వస్తువుపై వస్తువు తయారీ తేదీ, గడువు ముగిసే తేదీ, ప్యాకింగ్ కంపెనీ పేరు, అడ్రస్సు, బార్‌కోడ్, కస్టమర్ కేర్ నంబర్.. ఇలా అన్ని విషయాలు స్పష్టంగా ఉండాలని చెప్పారు. ప్రధానంగా తూకాల్లో మోసాలు చేసినా, తప్పుడు చిరునామా కలిగిన వస్తువులను విక్రయించినా కేసులు నమోదు చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యంగా బియ్యం విషయానికి వస్తే రిటైల్‌గా విక్రయించే రైస్ బ్యాగ్ 25 కిలోలు ఉండాలని, ఇది ప్రభుత్వ నిబంధన అన్నారు. కానీ కొంత మంది వ్యాపారులు 24 కిలోలు, మరికొందరు 23 కిలోల తూకంతో విక్రయాలు జరుపుతున్నారని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. హోల్‌సేల్‌గా విక్రయించే రైస్ బాగ్ 26 కిలోలు తూకం ఉండాలన్నారు. ఇన్‌స్పెక్టర్ షేక్ సైదా మాట్లాడుతూ వినియోగదారులను ఏ రకంగా మోసగించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
తూనికలు కొలతలు శాఖ జిల్లా అసిస్టెంట్ కంట్రోలర్ అల్లూరయ్య