
భూమాతకు నవ రక్ష
ఆదివారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2025
ముప్పాళ్ళ: నవధాన్యాల సాగుతో భూమి సారవంతంగా మారుతుంది. రుతుపవనాలు రాకముందే ప్రధాన పంటకు ముందు నవధాన్యాల సాగు చేపట్టడం ద్వారా భూమిని రక్షించుకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. నవధాన్యాల సాగు – నేలతల్లి బాగు అనే పేరుతో అధికారులు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. బహుళ పంటల సాగుకు అండగా నిలవడం, భూసారాన్ని పెంచడం, ప్రజలకు ఆరోగ్యకరమైన ఉత్పత్తులు అందించడం ఈ సాగు ఉద్దేశం. ఈ సాగు భూమిలోని సేంద్రియ కర్భనం పెంపుతో పాటుగా చీడ పీడల బెడద తగ్గుతుందని వివరిస్తున్నారు.
విభిన్న జాతుల విత్తనాలతో కిట్
ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీఎండీఎస్) అనేది పంట కాలానికి సంబంధం లేకుండా ప్రధాన పంటకు ముందు 20 నుంచి 30 రకాల వివిధ పంట విత్తనాలను కలిపి వెదజల్లుతారు. 365 రోజులు భూమి పంటలతో కప్పబడి ఉండాలనే వ్యూహంతో ఈ సాగుపద్ధతిని అవలంభిస్తారు. పప్పు ధాన్యాలు, నూనె, తీగజాతి, చిరుధాన్యాలు, త్రుణధాన్యాలైన పెసర, మినుము, నువ్వులు, వేరుశగన, రాగులు, కందులు, జొన్నలు వంటి 30 రకాల వివిధ జాతుల విత్తనాలు కిట్‌లో ఉంటాయి. ఈ కిట్లు డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా గ్రామాల్లో తయారు చేయించి రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు అందిస్తున్నారు.
సాగుతో ఉపయోగాలు...
పీఎండీఎస్ పద్ధతిలో వివిధ పంటల వేర్లు భూమిలో వైవిధ్య రకాల సూక్ష్మజీవులకు ఆశ్రయం కల్పించి పంటలకు ఉపయోగపడే వీటి సంతతిని అభివృద్ధి చేస్తాయి. తద్వారా ప్రధాన పంటకు కావాల్సిన స్థూల, సూక్ష్మ పోషకాలను అందుబాటులోకి తీసుకువచ్చి మొక్కల వేరు వ్యవస్థ గ్రహించేట్లు చేస్తాయి. నవధాన్య పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా ఉపయోగపడతాయి. నేల గుల్ల బారి వానపాములు వృద్ధి చెందుతాయి. నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది. పలు పంటల సాగు వల్ల అదనపు ఆదాయం కలుగుతుంది.
82,823 ఎకరాల సాగు లక్ష్యం
జిల్లా ప్రకృతి వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో గ్రామాల వారీగా నవధాన్యాల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధానం అమలు చేసేందుకు ప్రత్యేకంగా ప్రతి సబ్‌డివిజన్ కు ఒక మాస్టర్‌ట్రైనర్‌ను నియమించారు. జిల్లా వ్యాప్తంగా ఆరు డివిజన్‌లలో 132 గ్రామాల్లో 46,368 మంది రైతులతో 82,823 ఎకరాల్లో నవధాన్య సాగును లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం 29,628 కిట్లు తయారీ చేసి రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచారు. 18,894 కిట్లు రైతులకు పంపిణీ చేశారు. ఇప్పటికే 8,360 ఎకరాల విస్తీర్ణంలో పీఎండీఎస్ నవధాన్యాల సాగు చేశారు.
నవధాన్యాలతో తయారు చేసి పంపిణీకి సిద్ధంగా ఉన్న కిట్లు
నవధాన్యాల సాగు వలన భూమిలో జీవ వైవిధ్యం పెరిగి ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు వృద్ధి చెంది రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. ప్రధాన పంటకు ఎరువులు, పురుగుమందులు వాడకుండా పేడ, మూత్రం, సహజసిద్ధమైన అవశేషాలు వాడటం వలన ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యకర వ్యవసాయ ఉత్పత్తులను పండించవచ్చు.
కె.అమలకుమారి, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్
గత ఏడాది రెండెకరాల్లో నవధాన్యాల సాగు చేశా. ఏప్రిల్‌లో సాగు చేస్తే మే నెలలో కోతకు వచ్చింది. పశువులకు మేతగా సెంటు రూ.100 చొప్పున అమ్మితే రూ.20వేలు ఆదాయం వచ్చింది. మళ్లీ మిరప, మొక్కజొన్న సాగు చేశాం. అదనపు ఆదాయం వచ్చింది.
– కాకుమాను పూజ,
ప్రకృతి సేద్యం విలేజ్ యూనిట్ ఇన్‌చార్జ్, నార్నెపాడు
న్యూస్‌రీల్
రెండెకరాల్లో సాగు చేశా..
నవధాన్యాల సాగు లాభదాయకం..
పీఎండీఎస్‌తో వేరు వ్యవస్థకు భద్రత
20 నుంచి 30 విభిన్న జాతుల
విత్తనాలతో కిట్
132 గ్రామాల్లో ప్రకృతి సాగుకు సిద్ధం

భూమాతకు నవ రక్ష

భూమాతకు నవ రక్ష

భూమాతకు నవ రక్ష