అవిభక్త కొరాపుట్ జిల్లాలో 686 పాఠశాలలు మూసివేత
కొరాపుట్: అవిభక్త కొరాపుట్ జిల్లాలో గత ఐదేళ్లలో 686 పాఠశాలలు మూసి వేశారని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంట్‌లో తన ప్రశ్నకి కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలో వెనుక బడిన జిల్లాలలో అవిభక్త కొరాపుట్ జిల్లాలు కొరాపుట్, నబరంగ్‌పూర్, రాయగడ, మల్కన్‌గిరి జిల్లాలు ఉన్నాయన్నారు. ఈ జిల్లాలలో అత్యధికంగా గిరిజనులు జీవిస్తున్నారని గుర్తు చేశారు. సరైన రహదారుల లేని కొండ ప్రాంతాల్లో ప్రభుత్వం వరుసగా పాఠశాలలు మూసి వేస్తూ గిరిజన బాలలకు విద్యాహక్కు దూరం చేసిందన్నారు. ఈ పరిణామంతో 8,854 మంది గిరిజన బాలలపై నేరుగా విద్యా సమస్య పడిందన్నారు. వీరు దూరంగా ఉన్న పాఠశాలలకు వెళ్లడానికి అనేక కష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం మాత్రం మూసి వేయడానికి అనేక సాకులు చూపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన భవనాలు లేకపోవడం, ఉపాధ్యాయుల కొరత తదితర అంశాలను పేర్కొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యా హక్కు కింద 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒక కిలోమీటర్ లోపు పాఠశాలలు ఉండాలన్నది నిబంధన అని గుర్తు చేశారు. ఈ మూసి వేసిన పాఠశాలలు అత్యధికంగా కొరాపుట్ జిల్లా దశమంత్‌పూర్ సమితిలో 46, లమ్తాపుట్ సమితిలో 35, మల్కన్‌గిరి జిల్లా కలిమెలలో 27, నబరంగ్‌పూర్ జిల్లా జొరిగాంలో 20, రాయగడ జిల్లా మునిగుడలో 13 పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ విషయం తాను ఇది వరకు ఆరోపిస్తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ప్రస్తుతం పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎంపీ సప్తగిరి ఉల్క పేర్కొన్నారు. ఈ పాఠశాలలు పునరుద్ధరణ చేసేంత వరకు తాను పోరాటం చేస్తానని తెలిపారు.


