గాయత్రీ మందిరం ప్రతిష్టోత్సవాలు
రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్‌లో కొత్తగా నిర్మించిన గాయత్రీ మందిర ప్రతిష్టోత్సవాలు మంగళవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గాయత్రీ పరివార్‌కు చెందిన సేవా కమిటీ సభ్యులు కలశ యాత్రను నిర్వహించారు. కల్యాణి నది నుంచి తీసుకొచ్చిన శుద్ధ జలాలను కలశాలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మందిరం వద్ద నిలిపారు. అనంతరం శాంతి యజ్ఞం, ప్రాణ ప్రతిష్ట, ధ్వజస్తంభం ఏర్పాటు తదితర పూజలు నిర్వహించారు.
బాల కార్మిక వ్యవస్థ
నిర్మూలనకు కార్యాచరణ
భువనేశ్వర్: రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం ప్రభుత్వం రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందని కార్మిక, ఉద్యోగుల రాష్ట్ర బీమా విభాగం మంత్రి గణేష్ రామ్ సింగ్‌కుంటియా మంగళవారం శాసన సభలో తెలియజేశారు. తొమ్మిది విభాగాల సమన్వయంతో ఈ ప్రణాళిక కార్యాచరణ కొనసాగుతుందన్నారు. బాల కార్మికుల నిర్మూలన దిశలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణకు సంబంధించి ఎమ్మెల్యే టొంకొధొరొ త్రిపాఠి లేవనెత్తిన ప్రశ్న కు మంత్రి బదులు ఇచ్చారు. రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికలో భాగంగా క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించి సహాయక చర్యలు చేపడుతున్నారు. అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు తరచు నిర్వహించి చైతన్యపరుస్తున్నారని మంత్రి వివరించారు. బాల కార్మికులపై చివరి సర్వే 1997లో నిర్వహించారు. ఈ సర్వేలో 2,15,222 మంది బాల కార్మికులను గుర్తించారని మంత్రి పేర్కొన్నారు. బాల కార్మికుల (నిషేధం, నియంత్రణ) చట్టం, 1986, బాల కార్మికులను గుర్తించి వారిని రక్షించడానికి జిల్లా స్థాయి తనిఖీలను తప్పనిసరి చేయడం జరిగిందన్నారు. బాల కార్మికులను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటోందని మంత్రి హామీ ఇచ్చారు.


