మౌలిక సేవల విస్తరణ
● లఘు ఖనిజ నిధులను జిల్లాలోనే ఖర్చు చేయాలి
● డీఎంఎఫ్ సమీలో ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి
భువనేశ్వర్: జిల్లా ఖనిజ నిధికి చేరుతున్న లఘు ఖనిజ ఆర్థిక వనరుల్ని సంబంధిత జిల్లా అభివృద్ధికి మాత్రమే వినియోగించాలని ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ఆదేశించారు. స్థానిక లోక్ సేవా భవన్‌లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ (డీఎంఎఫ్) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి రాష్ట్రంలో 11 డీఎంఎఫ్ జిల్లాల నుంచి సమగ్రంగా రూ. 34,052 కోట్లు వసూలు కాగా, అందులో దాదాపు 55 శాతం నిధులు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. ఈ వ్యయాన్ని పెంచి ప్రజలకు ప్రాథమిక, మౌలిక సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటీవల పునరుద్ధరించిన 10 జిల్లాల్లో డీఎంఎఫ్ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ప్రతి డీఎంఎఫ్ ఆడిట్ నివేదికతో పాటు వార్షిక నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. లఘు ఖనిజ పదార్థాల నుంచి సేకరించిన డీఎంఎఫ్ నిధులను సంబంధిత జిల్లాలో ఎక్కడైనా ఉపయోగించవచ్చని మండల కార్యదర్శులకు సూచించారు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, నీటి సరఫరా, రవాణా వంటి ప్రాథమిక అవసరాలకు ఖర్చు చేయాలని ఆదేశించారు. గనుల ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తి ప్రాథమిక సేవలను అందించాలన్నారు.
ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి డీఎంఎఫ్ ట్రస్ట్ బోర్డు త్వరలో సమావేశం కానున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఖనిజ పదార్థాల తవ్వకాల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రభావితమైన గ్రామాలను గుర్తించాలన్నారు. ఆయా ప్రాంతాలకు సమీపంలో ఉన్న స్థావరాలలో కాలుష్యం నివారణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎండోమెంట్ నిధి..
వార్షిక డీఎంఎఫ్ నిధుల సేకరణ రూ. 10 కోట్లు, అంతకంటే ఎక్కువ ఉన్న జిల్లాలు ఎండోమెంట్ నిధి ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ నిధిని ప్రభుత్వ సెక్యూరిటీలుగా, బాండ్లుగా, షెడ్యూల్డ్ బ్యాంకుల ఫిక్స్‌డ్ పొదుపు ఖాతాల్లో పెట్టుబడి పెట్టవచ్చన్నారు. ఖనిజాలు అడుగంటి పోయిన తర్వాత, అనివార్య పరిస్థితుల్లో గనుల తవ్వకం కార్యకలాపాలు ఆగిపోయిన ప్రాంతాలలో భవిష్యత్ తరాలకు జీవనోపాధిని కల్పించేందుకు ఈ నిధిని ఉపయోగిస్తామని ముఖ్యమంత్రి వివరించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రముఖ కార్యదర్శి మనోజ్ అహుజా, అభివృద్ధి కమిషనర్ అనూ గర్గ్, గనుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సురేంద్ర కుమార్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ కార్యదర్శి శాశ్వత్ మిశ్రా పాల్గొన్నారు.


