మాజీ ఎంపీ ప్రదీప్‌పై కేసు నమోదు
కొరాపుట్: ప్రతిపక్ష బీజేడీకి చెందిన నబరంగ్‌పూర్ మాజీ ఎంపీ ప్రదీప్ మజ్జిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల కొసాగుమ్డ సమితిలోని ఆశ్రమ పాఠశాలలో వంట గదిలో ప్రెజర్ కుక్కుర్ పేలింది. ఈ ఘటనలో 7వ తరగతి విద్యార్థి ధనుర్జయ బోత్ర ముఖం కాలిపోయింది. దీనిని కప్పిపుచ్చి బాలుడిని రహస్య గదిలో ఉంచి దాదాపు 9 రోజులు దాచారు. విషయం తెలుసుకున్న మాజీ ఎంపీ ప్రదీప్ అర్ధరాత్రి ఆశ్రమ పాఠశాల గోడ దూకి బాలుడిని రక్షించారు. అనంతరం అదే రాత్రి కలెక్టర్ మహేశ్వర్ స్వయ్ నివాసానికి వెళ్లి ఘోరం చూపించారు. అక్కడే ఉన్న డీడబ్ల్యూఓ రవీంద్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గిరిజన జాతిపై ఇటువంటి దాష్టీకాలు చేస్తే కాల్చేస్తానని కలెక్టర్ సమక్షంలో హెచ్చరించారు. వెంటనే కలెక్టర్ స్పందించి హాస్టల్ వార్డెన్, కుక్, ఇతర సిబ్బందిని సస్పెండ్ చేశారు. అయితే ప్రదీప్ అర్ధరాత్రి వేళ హాస్టల్ దూకి విద్యార్థిని బయటకు తేవడం పట్ల అధికార బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజ బీహారి దాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులను బెదిరించడాన్ని ఖండించారు. ఈ మేరకు బుధవారం నబరంగ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి (డిడబ్ల్యూఓ) రవీంద్ర పాలక ఫిర్యాదు చేయడంతో మాజీ ఎంపీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ప్రకటించారు.
మాజీ ఎంపీ ప్రదీప్‌పై కేసు నమోదు


