ఈ–కేవైసీ గడువు పొడిగింపు
భువనేశ్వర్: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఈ–కేవైసీ ధ్రువీకరణ ప్రక్రియ గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్లు ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమ శాఖ మంత్రి కృష్ణ చంద్ర పాత్రో బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రక్రియలో భారీ ఎత్తున అవకతవకలు వెలుగులోకి వచ్చాయని మంత్రి వివరించారు. 6,83,995 మంది మృతులు లబ్ధిదారులుగా ఉన్నట్లు అధికారులు గుర్తించారని వెల్లడించారు. వారి వివరాల్ని ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)కు తెలియజేసి అనుబంధ చర్యలకు ఆదేశించామన్నారు. ఆహార భద్రత వ్యవస్థలో దుర్వినియోగం, మోసపూరిత లబ్ధి వ్యవహారాల్ని ఈ–కేవైసీ వెలుగులోకి తెస్తుందన్నారు. ఇప్పటి వరకు 33,128 అనర్హమైన రేషన్ కార్డులు రద్దు చేసినట్లు మంత్రి వెల్లడించారు. అత్యధికంగా ఖుర్దా జిల్లాలో బూటకపు రేషన్ కార్డులు వెలుగు చూశాయన్నారు. జిల్లాలో ఈ–కేవైసీ ధృకరణ ప్రక్రియలో 4,747 బూటకపు లబ్ధిదారుల్ని గుర్తించి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.


