రూ.2 వేలు ఇస్తేనే మృతదేహం ఇస్తాం
రాయగడ: ఒక బాలుడు ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతి చెందిన ఘటనకు సంబంధించి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు పోస్టుమార్టం పూర్తి చేసి వెళ్లిపోగా సిబ్బంది మాత్రం రూ.రెండు వేలు లంచం ఇస్తే గాని మృతదేహాన్ని ఇచ్చేదిలేదని డిమాండ్ చేశారు. దీనిపై బాధిత కుటుంబీకులు గ్రామస్తుల సహాయంతో జిల్లా ముఖ్యవైద్యాధికారికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జిల్లాలోని కాసీపూర్ సమితి గొరఖ్‌పూర్ పంచాయతీలొని కన్హుగుడ గ్రామంలో శుక్రవారం జరిగింది.
గ్రామంలో నివసిస్తున్న కొంబొమజ్జికి చెందిన మూడేళ్ల కొడుకు తొరు మజ్జి అనే బాలుడు సమీపంలో గల నదిలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కాశీపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం వైద్యుడు పోస్టుమార్టం చేసి వెళ్లిపోయారు. పోస్టుమార్టం సమయంలో వైద్యునికి సహకరించిన ఆస్పత్రి సిబ్బంది హృషి కేష్ సాహు అనే వ్యక్తి బాలుని తండ్రిని రూ.2వేలు లంచం అడిగాడు. లంచం ఇస్తేనే గానీ మృతదేహాన్ని ఇచ్చేది లేదని కచ్చితంగా చెప్పడంతో గత్యంతరం లేని కొంబొ మజ్జి విషయాన్ని గ్రామస్తులకు చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా కలసి చందాలు పోగు చేసుకుని వెయ్యి రూపాయలను సర్దుబాటు చేశారు. ఈ మొత్తాన్ని తీసుకువెళ్లి హస్పటల్ సిబ్బంది హృషికేస్ సాహుకు ఇవ్వడంతో అడిగింది రెండు వేల రూపాయలైతే ఇచ్చేది వెయ్యి రూపాయలా అని తిరిగి ముఖాన కొట్టాడు. అనంతరం గ్రామానికి చెందిన టంకధర్ సాహు నేతృత్వంలో గ్రామస్తులంతా కలసి తమకు జరిగిన విషయాన్ని జిల్లా ముఖ్యవైద్యాధికారి పేరిట కాసీపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముఖ్య వైద్యునికి, అదేవిధంగా కాశీపూర్ పోలీస్ స్టేషన్‌లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.


