పూరీ జగన్నాథ ఆలయం విద్యుద్దీపాలంకరణ
● రూ. 17 కోట్ల వ్యయ ప్రణాళిక
భువనేశ్వర్: పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయం విద్యుద్దీప అలంకరణతో కాంతులీనే ఘడియలు దగ్గర పడుతున్నాయి. అత్యంత శక్తిమంతమైన ఎల్‌ఈడీ దీపాలతో దీపాలంకరణ వ్యయ ప్రణాళిక అంచనా రూ. 17 కోట్లు. రాత్రి పూట ప్రాచీన శ్రీ మందిరం సౌందర్యం కాంతులీనుతుంది. చీకటి సమయంలో ఆలయ నిర్మాణ సౌందర్యం, సంక్లిష్టమైన శిల్పాలను తళుకులు మెరిపించి సందర్శకుల అనుభవాన్ని ద్విగుణీకృతం చేయడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఆలయ ప్రాచీన కట్టడాలు, శిల్పాలు వగైరాకు ఏమాత్రం కళంకం ఏర్పడకుండా అత్యాధునిక ఎల్‌ఈడీ విద్యుద్దీపాలంకరణ చేపడుతున్నట్లు శ్రీ మందిరం ప్రధాన నిర్వాహకుడు డాక్టర్ అరవింద కుమార్ పాఢి తెలిపారు. యాత్రికులు, సందర్శకులు ఆలయ వైభవాన్ని రాత్రింబవళ్లు చవిచూసేందుకు వీలుగా ఈ ప్రాజెక్టు రూపొందించినట్లు వివరించారు. ఈ ప్రణాళిక పూర్తిగా అమలులోకి వస్తే శ్రీ మందిరం రాత్రి పూట చీకటి సమయంలో దాదాపు 10 కిలో మీటర్ల దూరం నుంచి కాంతులు ప్రసరణతో తళుక్కుమంటుందన్నారు. ఇది యాత్రికులకు ఉత్కంఠభరితమైన దృశ్యంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రధాన నిర్మాణం, చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు, నాలుగు ప్రధాన ద్వారాలను ప్రకాశవంతం చేసే ఈ ప్రాజెక్టును ఎస్‌జేటీఏ మరియు భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ఏఎస్‌ఐ వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేసింది. దీని కోసం రూ. 17.12 కోట్లు కేటాయించారు. ప్రాథమిక సౌకర్యాల పెంపుదల–వారసత్వ, నిర్మాణ శైలి అభివృద్ధి (ఒబొఢా) పథకం కింద ఈ నిధులను ఉపయోగించుకోవాలని ఎస్‌జేటీఏ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తుంది.
గత ఆలయ పాలక మండలి సమావేశంలో శ్రీ మందిరం ఎల్‌ఈడీ విద్యుద్దీపాలంకరణ ప్రాజెక్టు డీపీఆర్‌పై చర్చించి ఆమోదించింది. భోగ మండపం, జగ్‌మోహన్, నాట్య మండపం, గర్భ గుడి, మేఘనాథ్ ప్రహరి, శ్రీ మందిరం ప్రధాన సముదాయం, పరిసరాల్లో దేవాలయాలు, ఆనంద బజార్, కూర్మ మండపం వంటి కట్టడాల్ని ఈ ప్రాజెక్టు పరిధిలో విలీనం చేశారు.


