పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ శిబిరం
జయపురం: జయపురం ఫూల్‌బెడ గ్రామంలో గల ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం, జయపురం వారు పుట్టగొడుగుల వ్యవసాయంపై శిక్షణ శిబిరం నిర్వహించారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ వ్యవసాయ విభాగ కేంద్రంలో కెపాసిటీ బిల్డింగ్ పథకంలో భాగంగా మంగళవారం స్వయం సహాయక గ్రూపు మహిళలకు నిర్వహించిన శిక్షణ శిబిరంలో బొయిపరిగుడ సమితి నుంచి 60 మంది స్వయం సహాయక గ్రూపుల మహిళలు పాల్గొన్నారు. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కేంద్రం సీనియర్ ఉద్యోగి త్రిపతి ఖొర అతిథులను ఆహ్వానించారు. బొయిపరిగుడ సమితి ప్రభుత్వ ఉద్యాన వ్యవసాయ విభాగ అధికారి త్రిలోచన పాఢీ పుట్టగొడుగు వ్యవసాయం చేసే విధానాన్ని స్వయం సహాయక గ్రూపుల మహిళలకు వివరించారు. అతి తక్కువ రోజుల్లో పుట్టగొడుగు వ్యవసాయం ఎలా చేయాలి, పండించిన పంటను ఎలా మార్కెట్ చేసి లాభాలు ఎలా సంపాదించాలి అన్నది వారికి బోధించారు. పుట్టగొడుగు వ్యవసాయం వల్ల మహిళా రైతు కుటుంబాలు లబ్ధి పొందే పద్ధతిపై త్రిలోచన పాఢీ వివరించారు. పుట్ట గొడుగు పంటకు ఏయే వస్తువులు అవసరం, వాటిని ఎలా సంపాదించాలో మహిళలకు విపులీకరించారు. పుట్టగొడుగు పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు.
పుట్ట గొడుగుల పెంపకంపై శిక్షణ శిబిరం


