దొంగల హల్‌చల్
● బూర్జలో ఆరు తులాల బంగారం, 23 తులాల వెండి చోరీ
● టెక్కలి అయ్యప్పనగర్‌లో 60 తులాల వెండి మాయం
బూర్జ/టెక్కలి రూరల్ : జిల్లాలో దొంగలు పడ్డారు. బూర్జ, టెక్కలి అయ్యప్పనగర్‌లో చోరీలకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బూర్జ గ్రామానికి చెందిన చెన్నూరు రమేష్ గ్రామంలో టిఫిన్ షాపు నడుపుతున్నారు. శనివారం కుటుంబంతో కలిసి అరకు విహార యాత్రకు వెళ్లారు. టిఫిన్ షాపులో పనిచేస్తున్న సూర్యనారాయణ అనే వ్యక్తి మంగళవారం రమేష్ ఇంటికి వెళ్లిచూడగా తలుపులు తెరిచి ఉండటం గుర్తించి రమేష్‌కు ఫోన్ ద్వారా సమాచారం తెలియజేశారు. వెంటనే ఆయన వచ్చి చూడగా బీరువాలో ఆరుంపావు తులాల బంగారం, 23 తులాల వెండి, రూ.లక్ష నగదు చోరీకు గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించారు. ఆమదాలవలస సీఐ పాండ్రంకి సత్యనారాయణ, ఎస్సై ఎం.ప్రవళ్లిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.
అయ్యప్పనగర్‌లో వరుస దొంగతనాలు..
టెక్కలి అయ్యప్పనగర్‌లో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో కాలనీవాసులు భయాందోళనకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం రాత్రి వరుస ఇళ్లల్లో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారం వసంతరావు శుక్రవారం మధ్యాహ్నం శుభకార్యానికి వెళ్లి వచ్చే సరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటం గమనించారు. లోపలికి వెళ్లి చూడగా సుమారు 60 తులాల వెండి, రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్ చోరీకి గురైనట్లు గుర్తించారు. అదే రోజు పొరుగు ఇంట్లోకి సైతం దుండగులు చొరబడే ప్రయత్నం చెయ్యగా వృద్ధురాలు కేకలు వేయడంతో పరారయ్యారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వసంతరావు తెలిపారు.


