వంతెన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
పర్లాకిమిడి: గజపతి జిల్లా కాశీనగర్ బ్లాక్‌లో బోత్తవ పంచాయతీ, పొరుగున ఉన్న కొత్తూరు మండలం లివురి గ్రామానికి వంశధార నదిపై ఒక వంతెన నిర్మించడానికి పదేళ్లుగా కృషి చేస్తున్నారు. కోడూరు నారాయణరావు గతంలో పర్లాకిమిడి శాసనసభ్యులుగా పనిచేసిన సమయంలో ఇరురాష్ట్రాల అనుమతితో వంశధార నదిపై ఒక వంతెన నిర్మిస్తే లివురి, కాశీనగర్ వాసులకు మార్గం సుగమం అవుతుందని ప్రయత్నించగా అది ఇప్పుడు మోహాన్ మఝి ప్రభుత్వం చొరవతో అనుమతి లభించినందుకు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ మఝికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పర్లాకిమిడి నియోజకవర్గం గుసాని సమితిలో శోబర పంచాయతీ పద్మపూర్ గ్రామానికి ఒక వంతెన నిర్మించడానికి ప్రభుత్వం జిల్లా గ్రామీణ రోడ్లు శాఖకు ఆమోదం తెలిపినట్టు ఉత్తరం రాశారని, దీంతో ఈ రెండు వంతెనలు రాష్ట్ర సేతుబంధ యోజన కింద పనులు త్వరలో ప్రారంభం అవుతాయని కోడూరు నారాయణ రావు విలేకరల సమావేశంలో తెలియజేశారు. స్థానిక ఇరదల వీధిలో బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఈ విషయం ఆయన తెలియజేశారు. పర్లాకిమిడిలో జాజిపురం గ్రామం నుంచి బైపాస్ రోడ్డు పనులకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో స్థల సేకరణ సర్వే పూర్తిచేసుకుని టెండర్లు పిలుస్తున్నట్టు జిల్లా రోడ్లు–భవనాల శాఖ ఎస్‌ఈ తెలియజేసినట్టు కె.నారాయణ రావు చెప్పారు. జిల్లా అభివృద్ధి, గ్రామీణ వికాసం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మఝి ప్రభుత్వం కృత నిశ్చయంతో పనిచేస్తుందని బిజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోడూరు నారాయణరావు అన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోడూరుతో పాటు బిజేపీ జిల్లా అధ్యక్షులు నబకిశోర్ శోబోరో తదితరులు పాల్గొన్నారు.


