పోర్టు వాహనాల అడ్డగింత
● నిర్లక్ష్య డ్రైవింగ్‌పై గ్రామస్తుల మండిపాటు
సంతబొమ్మాళి: మూలపేట పోర్ట్ వాహనాలను గ్రామస్తులు మంగళవారం అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. కూర్మనాథపురం రామాలయం ఎదురుగా మూలపేట పోర్టుకు సంబంధించిన వాల్వో టిప్పర్ మెయింటెనెన్స్ కోసం పార్కింగ్ చేశారు. మెయింటెనెన్స్ పని అయిన తర్వాత లిఫ్ట్ డౌన్ చేయకుండా రోడ్డుపైకి రావడంతో విద్యుత్ వైర్ ఇంజిన్‌కు ట్రాలీకి మధ్య ఉండిపోయింది. అది గమనించిన డ్రైవర్ టిప్పర్‌ను ముందుకు తీసుకుని వెళ్లడంతో విద్యుత్ హైటెన్షన్ వైర్లు రాపిడీకి గురై పెద్ద శబ్దంతో మంటలు చెలరేగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ శబ్దంతో రోడ్డు మీద ఉన్న వ్యక్తులు పరుగులు తీయగా, ఇంట్లో ఉన్న గ్రామస్తులు, మహిళలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. టిప్పర్‌కు, ట్రాలీకి మధ్యన ఉన్న వైరును చూసి ఆందోళన చెంది టిప్పర్ కదలకుండా అడ్డుకున్నారు. ఇలా జరగడం ఇది ఐదో సారి అని ఇలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఎంతమంది ప్రాణాలు తీస్తారంటూ మహిళలు, గ్రామస్తులు మండిపడ్డారు. దీంతో ట్రాపిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సంతబొమ్మాళి ఎస్‌ఐ వై.సింహాచలం సంఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకొని గ్రామస్తులతో మాట్లాడారు. ఇంటిలో విద్యుత్ పరికరాలన్నీ పాడైపోయాయని, సమస్య పరిష్కారం అయ్యేంత వరకు వాహనాలను కదలనీయబోమని గంటల తరబడి గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో గత్యంతరం లేక పోర్టు హెచ్‌ఆర్ మేనేజర్ రాఘవరెడ్డి సంఘటన స్థలానికి వచ్చి గ్రామస్తులతో మాట్లాడారు. జరిగిన నష్టాన్ని యాజమాన్యమే భరిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.


