రాష్ట్ర వరపుత్రిక ద్రౌపది ముర్ము
భువనేశ్వర్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్ర వరపుత్రిక వంటివారని వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రపతి శాసన సభ సందర్శన సందర్భంగా గవర్నర్ డాక్టరు హరిబాబు కంభంపాటి, స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝి, విపక్ష నేత నవీన్ పట్నాయక్ తదితర ప్రముఖులు ప్రసంగించారు. గవర్నర్ మాట్లాడుతు ఒడిశా శాసన సభ సభ్యులను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ప్రసంగించడం చరిత్రలో గర్వించదగిన మైలురాయిగా నిలుస్తుందన్నారు. 75 ఏళ్లలో తొలిసారిగా, సభకు ప్రథమ పౌరుడి నుంచి మార్గదర్శకత్వం పొందే అవకాశం లభించడం ఒడిశా ప్రజాస్వామ్య ప్రయాణానికి గొప్ప అర్థాన్ని జోడించే క్షణంగా పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి దేశంలోని అత్యున్నత పదవికి ఆమె ఎదగడం మన ప్రజాస్వామ్య బలాన్ని ప్రతిబింబిస్తుందన్నారు. ప్రతి పౌరుడికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి ప్రసంగిస్తు ఒడిశా ప్రజాస్వామ్య చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజుగా అభివర్ణించారు. విపక్ష నేత నవీన్ పట్నాయక్ ప్రసంగిస్తు మన రాష్ట్రానికి చెందిన రాష్ట్రపతి ఒడిశా శాసనసభను ఉద్దేశించి ప్రసంగించడం ఒడియా ప్రజలకు గొప్ప గౌరవమని పేర్కొన్నారు.


