రైల్వే ఉద్యోగులకు సత్కారం | - | Sakshi
Sakshi News home page

రైల్వే ఉద్యోగులకు సత్కారం

Nov 25 2025 5:50 PM | Updated on Nov 25 2025 5:50 PM

రైల్వే ఉద్యోగులకు సత్కారం

రైల్వే ఉద్యోగులకు సత్కారం

భువనేశ్వర్‌: విధి నిర్వహణలో రైల్వే ఉద్యోగుల అసాధారణమైన అప్రమత్తత, సమయస్ఫూర్తి, స్పందనే సమర్థవంతమైన రైలు కార్యకలాపాలకు సురక్షిత కవచంగా దోహదపడుతున్నాయి. ఈ దిశలో సురక్షిత రైలు కార్యకలాపాల్లో ఆదర్శంగా నిలిచిన నలుగురు రైల్వే ఉద్యోగులను ఖుర్దారోడ్‌ అదనపు మండల రైల్వే అధికారి (ఏడీఆర్‌ఎం) సోమవారం ప్రత్యేంకగా సత్కరించారు. సిబ్బంది అంకిత భావం, కార్యాచరణ, నైపుణ్యతకు గుర్తుగా ఈ సత్కారం చేసినట్లు తెలిపారు. అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (ఆపరేషన్‌న్స్‌) బెహరా, అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (ఇన్‌ఫ్రా) శుభ్ర జ్యోతి మండల్‌ ఉద్యోగులను అభినందించారు. బరంపురం గ్రేడ్‌– 3 ట్రాక్‌ మెయింటెయినర్లు ఎస్‌.శివ , బినోద్‌ ఘొడేయి, నీలకంఠేశ్వర్‌ స్టేషన్‌ పాయింట్స్‌ మ్యాన్‌ లక్ష్మీకాంత్‌ బెహరా, ఖుర్దారోడ్‌ మెమూ షెడ్‌ టెక్నీషియన్‌–1 హిరేన్‌ కుమార్‌ సింగ్‌ను సన్మానించారు.

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కృషి చేయనున్నట్లు ఏఐసీసీ సెక్రటరీ సూరత్‌సింగ్‌ ఠాకూర్‌ తెలిపారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు శ్రీకాకుళం జిల్లా నుంచి శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లా అధ్యక్షుడి నియామక ప్రక్రియను వేగవంతం చేసేందుకు తాము శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నామన్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేసిన నాయకులు, కార్యకర్తలను గుర్తించి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడిగా నియమించేందుకు ఏఐసీసీ చర్యలు తీసుకుంటుందన్నారు. పార్టీ జెండా మోసేవారే కాక, గత కొంతకాలంగా పార్టీ ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఇప్పటికే పలువురు నుంచి దరఖాస్తులు అందాయని, ఈనెల 27వ తేదీ వరకు శ్రీకాకుళంలోనే ఉంటూ అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ కమిటీ సభ్యులు లెక్కరాజు రామారావు, పాచిపెంట శాంతికుమారి, నాయకులు పేడాడ పరమేశ్వరరావు, అంబటి కృష్ణారావు, సనపల అన్నాజీరావు, రెల్ల సురేష్‌, గోవింద మల్లిబాబు, బస్వా షణ్ముఖరావు, ఎం.చక్రవర్తిరెడ్డి, లఖినేన నారాయణ, పూడి కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా కేంద్రంలోని డే అండ్‌ నైట్‌ వంతెన వద్ద, కిన్నెర కాంప్లెక్సు జుడో షోరూం వద్ద ఆదివారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ట్రాఫిక్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫాజుల్‌బేగ్‌పేటకు చెందిన రియ్యా లోకేష్‌ సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం పని నుంచి వచ్చిన లోకేష్‌ భోజనం చేసి ప్రతిరోజు మాదిరిగానే దత్తాత్రేయ గుడి సమీప నాగావళి కొత్త వంతెన ఫుట్‌పాత్‌పై విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లాడు. కాస్త నిద్రలోకి జారగానే కుడిచేయి ఫుట్‌పాత్‌పై నుంచి జారడం, కిమ్స్‌ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం 10 గంటలకు ఢీకొనడంతో తీవ్రగాయమైంది. రిమ్స్‌కు తరలించినా గాయం పెద్దది కావడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దమ్మలవీధికి చెందిన కాళహస్తి ఉమామహేశ్వరరావు అతని భార్య లావణ్య, కుమారునితో కలిసి కంపోస్టు కాలనీలోని అత్తవారింటికి ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్లారు. రాత్రి 10 గంటలకు తిరిగి ఓబీఎస్‌ వైపు వస్తుండగా ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టడంతో ఉమామహేశ్వరరావు భార్య లావణ్యకు గాయాలవ్వడంతో రిమ్స్‌కు తరలించారు. బాధితులు సోమవారం ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

హోరా హోరీగా రాష్ట్ర స్థాయి

హ్యాండ్‌ బాల్‌ పోటీలు

సింగరాయకొండ: మండల కేంద్రంలోని ఏఆర్‌సీ అండ్‌ జీవీఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–19 బాలబాలికల హ్యాండ్‌ బాల్‌ పోటీలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. ఈ పోటీల్లో 13 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. లీగ్‌ దశలో జరిగిన 30 మ్యాచ్‌ల్లో బాలబాలికలు పోటా పోటీగా పాల్గొన్నారు. లీగ్‌ మ్యాచ్‌లలో బాలుర విభాగంలో పూల్‌ సిలో విన్నర్స్‌గా విశాఖపట్నం, రన్నర్స్‌గా కర్నూలు, పూల్‌ డిలో విన్నర్‌గా కడప, రన్నర్‌గా చిత్తూరు, బాలికల విభాగంలో పూల్‌ బిలో విన్నర్‌ గా కడప, రన్నర్‌గా ప్రకాశం, పూల్‌ సిలో విన్నర్‌గా వెస్ట్‌ గోదావరి, రన్నర్‌గా విజయనగరం, పూల్‌ డిలో విన్నర్‌గా కృష్ణా, రన్నర్‌గా గుంటూరు జట్లు నిలిచాయి. మిగిలిన పూల్‌ విభాగాల్లో జరగాల్సిన పోటీలను మంగళవారం ఉదయం నిర్వహించి క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌ను మధ్యాహ్నానికి పూర్తి చేసి సాయంత్రానికి ఫైనల్స్‌ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ కే శంకర్రావు, అండర్‌–19 కార్యదర్శి ఈ చింపారెడ్డి తెలిపారు. ఈ టోర్నమెంటులో ఎస్సై బీ మహేంద్ర, డీఐఈఓ కే ఆంజనేయులు, జిల్లా హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా సెక్రటరీ పీ విజయ్‌కుమార్‌, పీఈటీలు ఎస్‌డీ జంషీర్‌, ఎన్‌టీ ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement