
జిల్లా స్థాయి యువజనోత్సవాలకు హాజరైన యువత
విజయనగరం: ఈ ఏడాది(2023–24) విజయనగరం జిల్లా యువజనోత్సవాలు ఉల్లాసంగా..ఉత్సాహంగా జరిగాయి. స్థానిక సీతం కళాశాల వేదికగా ఆహ్లాదకర వాతావరణంలో ఉత్సవాలు గురువారం నిర్వహించారు. సెట్విజ్, నెహ్రూ యువ కేంద్ర, సీతం కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన యువజనోత్సవాల్లో సెట్విజ్ సీఈవో బి.రామగోపాల్, జిల్లా యువజన అధికారి వెంకట్ ఉజ్వల్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈశ్వర్ కౌశిక్, సీతం కళాశాల డైరెక్టర్ ఎం. శశిభూషణ రావు, ప్రిన్సిపాల్ రమణ మూర్తి, బ్రహ్మ కుమారి అన్నపూర్ణ, మెప్మా పీడీ సుధాకర్, స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి గోవిందరావు, అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ సోమేశ్వరరావు, సంగీత కళాశాల అధ్యాపకురాలు బిందు తదితరులు పాల్గొని జ్వోతి ప్రజ్వలన చేశారు. అనంతరం స్వామి వివేకానంద, గురజాడ చిత్రపటాలకు పూలమాలలు వేసి యువజనోత్సవాలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు హాజరై వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కళా వైభవం, జీవిత నైపుణ్యం, శారీరక, మానసిక ఆరోగ్యం ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ వివిధ ప్రదర్శనలు నిర్వహించారు. సెట్విజ్ శాఖ ఆధ్వర్యంలో సుమారు 15 అంశాల్లో జిల్లా స్థాయి పోటీలు నిర్వహించగా యువత ఉత్సాహంగా పాల్గొన్నారు.
లక్ష్య సాధన కోసం తపించాలి
ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులంతా యువతను ఉద్దేశించి మాట్లాడుతూ బలమైన లక్ష్యం ఏర్పాటు చేసుకుని సాధన కోసం నిరంతరం తపించాలని, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆశయ సాధన కోసం అకుంఠిత దీక్ష, ఏకాగ్రత చాలా అవసరమని పేర్కొన్నారు. పోటీతత్వం అలవర్చుకోవాలని, మానసిక ధైర్యంతో ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక చైతన్యం పొందడానికి అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, క్రమ శిక్షణతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మంచి పనుల కోసం యువత తమ శక్తిని, జ్ఞానాన్ని ఉపయోగించాలని, చెడుకు దూరంగా ఉండాలని హితవు పలికారు.
ఆకట్టుకున్న ఆహార పదార్థాల ప్రదర్శన
జిల్లా యువజనోత్సవ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచగా అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. సీతం కళాశాల అధ్యాపకులు, సెట్విజ్, యువజన సర్వీసుల శాఖ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యంలో విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉల్లాసంగా జిల్లా యువజనోత్సవం
భాగస్వామ్యమైన యువత, అధికారులు,
ప్రముఖులు
15 అంశాల్లో పోటీలకు హాజరైన 500
మంది యువత

స్వామి వివేకానంద, మహాకవి గురజాడ చిత్రపటాల వద్ద అంజలి ఘటిస్తున్న అతిథులు



యువజనోత్సవాల్లో యువత ప్రదర్శనలు