 
															గ్రామాలను చుట్టుముట్టిన మునేరు
● రైతుల్లో ఆందోళన రేకెత్తిస్తున్న మోంథా తుపాను
● తుపాను ప్రభావంతో
తెలంగాణలో భారీ వర్షాలు
● ఫలితంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉప్పొంగిన వాగులు, వంకలు
● పెనుగంచిప్రోలు – మధిర మధ్య
పూర్తిగా నిలిచిపోయిన రాకపోకలు
● లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు
● పంట పొలాల్లోకి భారీగా
చేరిన మునేటి వరదనీరు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/కంచికచర్ల: మోంథా తుపాను తీరం దాటిందని ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, రైతులు ఊపిరి పిల్చుకున్నారు. అయితే ఆ తుపాను ప్రభావంతో తెలంగాణలోని ఖమ్మం, వరంగల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాల కారణంగా జిల్లాలోని మునేరు, కట్టలేరు, వైరా, పాలేరు వాగులు వరదతో పోటెత్తాయి. తుపాను ప్రభావంతో జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రైతులు సాగుచేసిన పంట పొలాలన్నీ నీటమునిగాయి. ఇప్పుడు వాగుల ఉధృతితో పంటలు చేతికందే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
కృష్ణానదిపై ఉన్న పులిచింతల ప్రాజెక్టు నుంచి గురువారం ఉదయం 4.85 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆ వరద సాయంత్రానికి 5.52 క్యూసెక్కులకు చేరింది. మధ్యాహ్నం నుంచి పులిచింతల నుంచి నీటి విడుదలను 98 వేల క్యూసెక్కుకు తగ్గించినా, వాగులు, వంకలు ఉప్పొంగడంతో కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మోంథా తుపాను ప్రభావంతో ప్రాథమిక అంచనాల ప్రకారం జిల్లాలో 16,786 మంది రైతులకు సంబంధించి 42,483 ఎకరాల్లో వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 586.5 ఎకరాల్లో అరటి, బొప్పాయి, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యటించి పంట నష్టం అంచనాలు రూపొందించనున్నారు.
నందిగామ నియోజకవర్గంలోని కంచికచర్ల, వీరులపాడు, నందిగామ మండలాల్లో 880 హెక్టార్లలో మొక్కజొన్న, 5,520 హెక్టార్లలో పత్తి, 1,526 హెక్టార్లలో వరి, 75 ఎకరాల్లో చెరుకు పంటలు దెబ్బతి న్నాయి. కంచికచర్ల మండలం కీసర వద్ద మునేరు సమీపంలో పది ఎకరాల్లో సాగుచేచేస్తున్న పామాయిల్ తోట పూర్తిగా మునిగిపోయింది.
జగ్గయ్యపేట మండలంలో పాలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పాలేరు పరీవా హక గ్రామాలయిన బోదవాడ అన్నవరం, రెడ్డినాయక్ తండా గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. జగ్గయ్యపేట, బోదవాడ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వత్సవాయి మండలం లింగాల వద్ద మునేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా 3,200 హెక్టార్లలో వరి, మినుము, పత్తి, మొక్కజొన్న, పెసర వంటి వ్యవసాయ పంటలు, 16 ఎకరాల్లో బొప్పాయి, 50 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయ పంటలు దెబ్బతిన్నాయని అధికారులు ప్రాథమి కంగా గుర్తించారు.
తిరువూరు నియోజవర్గంలో 17 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. కట్టలేరు, పడమటి వాగు, గుర్రపు వాగులు ఉధృతంగా ప్రవహించటంతో వరదనీరు పంట పొలాల్లోకి చేరాయి. నక్కపాలెం, తిరువూరు చౌటపల్లి, రేపూరు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి.
నా పేరు గుదే సాంబశివరావు. కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామానికి చెందిన నేను తొమ్మిది ఎకరాల్లో రూ.3.60 లక్షల ఖర్చుతో మొక్కజొన్న సాగుచేశా. 20 రోజుల క్రితం పంట కోతకు వచ్చింది. వర్షాలు పడటంతో మొక్కజొన్న కోసే యంత్రం చేలోకి వెళ్లలేకపోయింది. మరో సారి పంట కోయిద్దామనుకున్న సమయంలో మోంథా తుపాను విరుచుకుపడి చేతికొచ్చిన పంటను దెబ్బతీసింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయా. ఏం చేయాలో తోచటం లేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకావడంలేదు.
బుధవారం అర్ధరాత్రి నుంచే మునేరులో వరద ఉధృతి పెరిగి పలు గ్రామాలను చుట్టు ముట్టింది. లింగాల బ్రిడ్జి వద్ద ఐదు అడుగుల మేర వరద ప్రవహిస్తుండటంతో అధికారులు ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలను నిలిపివేశారు. ఇబ్రహీంపట్నం మండలంలో ఏనుగుగడ్డ వాగు పొంగటంతో దాములూరు, చిలుకూరు కొత్తపేట గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చినలంక పెదలంక గ్రామాల్లో వరదనీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రేవులో ఇసుక అక్రమంగా రవాణా చేసే పడవ నీట మునిగింది. పెనుగంచిప్రోలు కాజ్‌వేపై వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. మునేరు అవతల ఉన్న అనిగండ్లపాడు, ముచ్చింతాల, గుమ్ముడిదుర్రు, శివాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మైసమ్మ గండి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మునేటి ఆయకట్టు కింద పత్తి, వరి పంటలు నీట మునిగాయి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ సమీపంలో వరదనీరు చేరటంతో ఆ ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మునేరు, వైరా, కట్టలేరు పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. కంచికచర్ల మండలంలోని మునేరు కాజ్‌వే వద్ద గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో 1.59 క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది. తెలంగాణలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున వరద మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కీసర బ్రిడ్జి వద్ద మునేరు, కట్టలేరు, వైరాలు ప్రవాహాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ జి.లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు పరిశీలించారు.
 
							గ్రామాలను చుట్టుముట్టిన మునేరు
 
							గ్రామాలను చుట్టుముట్టిన మునేరు
 
							గ్రామాలను చుట్టుముట్టిన మునేరు
 
							గ్రామాలను చుట్టుముట్టిన మునేరు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
