
ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర రాజధాని అమరావతి పేరు, ప్రతిష్ట పెరిగేలా విజయవాడ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కలెక్టరేట్‌లోని శ్రీ ఏవీఎస్ రెడ్డి వీసీ హాల్‌లో విజయవాడ ఉత్సవ్ నిర్వహణపై మంగళవారం సమావేశం జరిగింది. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభిరామ్, కలెక్టర్ జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాల ద్వారా సాంస్కృతిక సంప్రదాయాల వారసత్వ సంపదను భావితరా లకు అందించేందుకు వీలుంటుందన్నారు. నగ రంలో తొలిసారిగా భారీఎత్తున కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విధాలా అంచనాలను సిద్ధం చేసుకొని, ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలతో పాటు భక్తులకు ఈ ఆధ్యాత్మిక పర్యటన మధురానుభూతులు మిగిల్చేలా పర్యాటకానికి కూడా ఊపు తెచ్చేలా ఉత్సవ్ ఉంటుందన్నారు. ఉత్సవాల విజయవంతానికి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం, పున్నమి ఘాట్, గొల్ల పూడి ఎగ్జిబిషన్ వేదిక తదితరాల్లో పటిష్ట ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందన్నారు. హోల్డింగ్ ప్రాంతాల ఏర్పాటు, పటిష్ట భద్రత, నగర సుందరీకరణ, తాగునీరు, పారిశుద్ధ్యం, సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా, ఫుడ్ కోర్టుల ఏర్పాటు, హెలీ టూరిజం, వాటర్ స్పోర్ట్స్, సంప్రదాయ కళా ప్రదర్శనలు తదితరాలపై సమావేశంలో చర్చించి చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన ఈఓ శీనా నాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా ఇన్‌చార్జి
మంత్రి సత్యకుమార్ యాదవ్