లక్కిరెడ్డిపల్లె(అన్నమయ్య జిల్లా): కన్న కొడుకు విదేశాల్లో గొప్ప చదువులు చదివి, ఉన్నత శిఖరాలు అధిరోహిస్తాడని ఆశపడ్డ ఆ తల్లిదండ్రులకు విధి తీరని అన్యాయం చేసింది. ఎంఎస్ పూర్తి చేసి పట్టా అందుకున్న సంబరం నిండకముందే, అదే రాత్రి మృత్యువు గుండెపోటు రూపంలో వచ్చి ఆ యువకుడిని బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లెకు చెందిన షేక్ తాజ్ కుమారుడు మహమ్మద్ కుమేల్ షేక్ (28) అమెరికాలో గురువారం రాత్రి హఠాన్మరణం చెందాడు.
కుమేల్ షేక్ ఇంజినీరింగ్ విద్యను చెన్నైలోని సత్యభామ వర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్ గేట్ వర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసుకున్న ఆయన, గురువారం జరిగిన కాన్వొకేషన్ వేడుకలో పట్టా అందుకున్నారు. ఆ ఆనందంలో కుటుంబ సభ్యులతో మాట్లాడి, స్నేహితులతో కలిసి ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్లారు. నిద్రలోనే గుండెపోటు రావడంతో ఆయన కన్నుమూశారు. మృతుడి తండ్రి స్టాంప్ రైటర్‌గా పనిచేస్తున్నారు.


