International Booker Prize 2022: భారత రచయిత్రి గీతాంజలి శ్రీ సంచలనం.. ‘రేత్‌ సమాధి’కి ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ ఘనత

Geetanjali Shree Wins International Booker Prize 2022 - Sakshi

భారత రచయిత్రి గీతాంజలి శ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదికపై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్‌ ప్రైజ్‌ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలి శ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్‌ సమాధి(2018).. ఆంగ్ల తర్జుమా ‘టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌’కు 2022కుగానూ ఇంటర్నేషనల్‌ బుకర్‌ ప్రైజ్‌ లభించింది. 

టాంబ్‌ ఆఫ్ సాండ్ అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి పుస్తకం. పైగా హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల. అంతేకాదు బుకర్‌ప్రైజ్‌ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత/రచయిత్రి ఈమెనే.

గురువారం లండన్‌లో జరిగిన ప్రదానోత్సవంలో.. గీతాంజలి శ్రీ(64)కి ప్రైజ్‌ను అందించారు. గీతాంజలితో పాటు రేత్‌ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్‌ చేసిన డైసీ రాక్‌వెల్‌(అమెరికా)కు కలిపి ఈ గౌరవం అందించారు. అంతేకాదు యాభై వేల బ్రిటిష్‌ స్టెర్లింగ్‌ పౌండ్లను సైతం క్యాష్‌ ప్రైజ్‌గా అందించారు. 

రేత్‌ సమాధి.. ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్‌లోకి జారుకుంటుంది. ఆపై ఆమె జీవితం కొత్త మారుతుంది.. అది ఎలా అనేది నవలా కథ.

బుకర్‌ వస్తుందని కలలలో కూడా ఊహించలేదు. సాధిస్తా అనుకోలేదు. ఇది ఒక గొప్ప గౌరవం. అద్భుతంగా ఉంది. గర్వంగా ఉంది అని పేర్కొన్నారు గీతాంజలి శ్రీ. ఇప్పటివరకు ఆమె ఐదు నవలలు రాయగా, మయి(2000) క్రాస్‌వర్డ్‌ బుక్‌ అవార్డు 2001కి నామినేట్‌ అయ్యింది. భారతీయ ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్‌పై విమర్శనాత్మక రచన కూడా చేసింది. చిన్నతనంలో పిల్లల పుస్తకాలు ఎక్కువగా ఆంగ్లంలో లేకపోవడంతోనే తాను హిందీపై మక్కువ పెంచుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్తుంటారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనల ఆధారంగా రాసిన  హమారా షహర్‌ ఉస్‌ బరాస్‌ విమర్శలకు ప్రశంసలు అందుకుంది.

  

డైసీ రాక్‌వెల్‌.. అమెరికన్‌ రైటర్‌, ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే కాదు.. పెయింటర్‌గా కూడా పాపులర్‌. ఉర్దూ, హిందీ నవలలను, రచలను ఎన్నింటినో ఆమె ఆంగ్లంలోకి అనువదించారు. 

వాస్తవానికి 2018లో హిందీలో రేత్‌ సమాధి ప్రచురించబడింది, 'టాంబ్ ఆఫ్ సాండ్' ఆమె పుస్తకాలలో యూకే ఇంగ్లీష్‌లోకి తర్జుమా అయయింది. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా ఆగస్టు 2021లో ఆంగ్లంలో ప్రచురించబడింది. మొత్తం 135 పుస్తకాలను యూకేకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించగా.. చివరి తరుణంలో ఆరు పుస్తకాలు బుకర్‌ ప్రైజ్‌ కోసం పోటీపడ్డాయి. అందులో టాంబ్‌ ఆఫ్‌ శాండ్‌కు ఈ గౌరవం దక్కింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top