పొరపాట్లకు తావివ్వొద్దు..
బోధన్‌రూరల్: తప్పిదాలు, పొరపాట్లకు తావులేకుండా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. బోధన్ మండలం అమ్దాపూర్ జీపీలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల ఎన్నిక కోసం జారీ చేసిన నోటిఫికేషన్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్‌డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని, అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహించాలని, సొంత నిర్ణయాలను అమలు చేయకూడదన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితిని పక్కాగా లెక్కించేలా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు కొత్త బ్యాంకు అకౌంట్ తెరిచి, ఆ అకౌంట్ ద్వారానే ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త బ్యాంకు అకౌంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆయా బ్యాంకులు వెంటనే అకౌంట్ ఓపెన్ చేసేలా చూడాలన్నారు.
● కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
● నామినేషన్ల స్వీకరణ కేంద్రం తనిఖీ


