
సవాల్‌గా పశు పోషణ
ఇందల్వాయి: జిల్లా వ్యాప్తంగా పశు సంపద వేగంగా క్షీణిస్తోంది. వ్యవసాయానికి అనుబంధంగా ఉంటూ రైతులకు అదనపు ఆదాయాన్ని అందించడమే కాకుండా, నిరుద్యోగులకు స్వయం ఉపాధి అందించే పశు పోషణ రంగం తిరోగమనంలో పయనిస్తోంది. ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేకపోవడం, అర్హులకు అవసరమైన రాయితీలు సకాలంలో అందకపోవడంతో పశు పోషకులు పశువులను అమ్ముకుంటున్నారు.
ప్రధాన కారణాలివే..!
గ్రామాల్లోని దాదాపు ప్రతి ఇంట్లో పాడి పశువులతోపాటు మేకలు, కోళ్లు ఉండేవి. అలాగే ప్రతి తండాలో ఆవుల మందలు ఉండేవి. పశువుల మేయడానికి అనుకూలంగా ఉండే భూములు(కంచెలు) వ్యవసాయ భూములుగా మారిపోవడం, పశువుల పాకలు ఖరీదైన ఇళ్ల స్థలాలుగా మారిపోవడం, రైతులకు, యువతకు పశుపోషణ అనేది భారంగా, చులకనగా మారడం, పశువైద్యానికి, పశు సంవర్ధక శాఖకు ప్రభుత్వం సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం వంటి కారణాలతో పాడి పశువులతోపాటు మేకలు, గొర్ల సంఖ్య వేగంగా తగ్గుతోంది.
గణాంకాలు ఇలా..
ఐదేళ్లకోసారి పశుగణన చేపడుతున్నారు. 2024కు సంబంధించిన పశుగణన వివరాలను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే 2019 లెక్కల ప్రకారం ఆవుజాతి పశువులు 1,01,252, గేదెజాతి – 2,06,898, గొర్రెలు – 7,35,549, మేకలు – 1,56,619, పందులు – 1,749 ఉన్నాయి. జిల్లాలో 2024లో చేపట్టిన పశుగణన వివరాలు వెల్లడించడానికి తమకు ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గేదెల్లో 27 శాతం, ఆవుల్లో 27.78 శాతం, గొర్రెలు 17, మేకలు 7.82 శాతం తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
జిల్లా పశుసంవర్ధక శాఖలో ఖాళీలు
సేవలతో పాటు ప్రోత్సాహకాలను
మరిచిన ప్రభుత్వం
వేగంగా తగ్గుతున్న పశు సంపద
పశువులను అమ్ముకుంటున్న పోషకులు
రాయితీలు అందించాలి
వ్యవసాయానికి అనుబంధంగా రెండు గేదెలను పెంచుతున్నా. పశువుల షెడ్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంకా మంజూరు కాలేదు. పశు వైద్యశాలలను ఆధునీకరించి సరిపడా వైద్య సిబ్బందిని నియమించాలి. యువ రైతులకు పశు పోషణపై అవగాహన కల్పించి గేదెలు, ఆవులు, మేకల పెంపకంలో రాయితీలు, ప్రోత్సాహకలు అందిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. – పూదరి నవీన్, నల్లవెల్లి
అగమ్యగోచరంగా..
పశువైద్య శాఖలో గోపాలమిత్రల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తొమ్మిది నెలలుగా జీతాలు లేవు. ఇచ్చే రూ.11 వేలల్లో రూ.4 వేలు వంద పశువులకు గర్భాధారణ చేయించే లక్ష్యానికే కట్టాలి. ప్రతి వారం పదుల సంఖ్యలో పశువులు అమ్మకానికి వెళ్తున్నాయి.
– బాలగంగారాం, గోపాలమిత్ర, గన్నారం
శిథిలావస్థలో పశు వైద్యశాలలు
జిల్లాలోని చాలాచోట్ల పశు వైద్యశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. సరైన మరమ్మతులు, నిర్వహణ లేక మూలనపడ్డాయి. నూతన భవనాలకు, పాతవాటి మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని ప్రజాప్రతినిధులు హామీలకే పరిమితమయ్యారు. ఇందల్‌వాయి, సిర్నాపల్లి పశు వైద్యశాలలే ఇందుకు నిదర్శనం. చాలా మండలాల్లో పశువైద్యులుగా ఇన్‌చార్జీలు కొనసాగుతున్నారు. గోపాలమిత్రల సేవలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సవాల్‌గా పశు పోషణ

సవాల్‌గా పశు పోషణ

సవాల్‌గా పశు పోషణ

సవాల్‌గా పశు పోషణ