
మనస్పర్ధలతో భార్యను కడతేర్చిన భర్త
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని..
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా వస్తుందనే అంజలిని భర్త గంగారెడ్డి అడ్డు తొలగించుకున్నట్లు సమాచారం. దుబాయిలో ఉంటున్న గంగారెడ్డి.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన మహిళతో కొన్నేళ్లుగా వివాహేతర బంధం కొనసాగిస్తున్నాడని భార్యకు తెలవడంతోనే గొడవలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. గొడవలు ముదిరి విడాకుల వరకు వెళ్లగా, కోర్టులో కేసు నడుస్తుండగానే అంజలిని గంగారెడ్డి హతమార్చాడు. దీంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
ఆర్మూర్‌టౌన్: కట్టుకున్న భార్యను కన్నపిల్లల ఎదుటే గొంతుకోసి హతమార్చిన ఘటన ఆర్మూర్ పట్టణంలో సోమవారం కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి. బోధన్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ అలియాస్ గంగారెడ్డికి జగిత్యాల జిల్లా మొగిల్‌పేట్ గ్రామానికి చెందిన అంజలి(35)తో 16ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గంగారెడ్డి జీవనోపాధి కోసం దుబాయ్ వెళ్తూ వస్తుండేవాడు. గంగారెడ్డి–అంజలి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకుల కోసం బోధన్ కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం కేసు నడుస్తోంది. గొడవల కారణంగా అంజలి తన ఇద్దరి కూతుళ్లతో కలిసి 20 రోజుల క్రితం ఆర్మూర్ పట్టణంలో నివాసముంటుంది. కేసు నిమిత్తం అంజలి కూతుళ్లతో కలిసి సోమవారం బోధన్ కోర్టుకు హాజరై తిరిగి ఇంటికి వచ్చి విశ్రాంతి తీసుకుంటోంది. భర్త గంగారెడ్డి ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి ఆమైపె కత్తితో దాడి చేశాడు. అడ్డుకున్న పిల్లలను తోసేసి అంజలి గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. పిల్లల అరుపులు విన్న ఇంటి యజమాని విషయం తెలుసుకునేందుకు రాగా అతనిని సైతం తోసేసాడు. దీంతో గంగారెడ్డి బయటికి వెళ్లకుండా యజమాని ఇంటి గేటు మూసేసి గడియపెట్టి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, అంజలి అప్పటికే మృతి చెందింది. ఘటనా స్థలాన్ని సీపీ సాయి చైతన్య, ఏసీబీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణ రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
పిల్లల ఎదుటే దారుణం

మనస్పర్ధలతో భార్యను కడతేర్చిన భర్త

మనస్పర్ధలతో భార్యను కడతేర్చిన భర్త