
19న సప్లిమెంటరీ పరీక్షలపై సమావేశం
నిజామాబాద్‌అర్బన్: నగరంలో ఖిల్లా జూనియర్ కళాశాలలో ఈనెల 19న ఉదయం 10. 30 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరుగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అధికారులు, సిబ్బంది సమావేశానికి సకాలంలో హాజరు కావాలని ఆయన తెలిపారు.
దోస్త్ సహాయ కేంద్రం ఏర్పాటు
నిజామాబాద్‌అర్బన్: నగరంలోని గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి ‘దోస్త్’ సహాయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దోస్త్ ద్వార డిగ్రీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు అన్నారు. కళాశాలలో 1860 సీట్లు వివిధ కోర్సుల్లో ఉన్నాయన్నారు.
నల్లమట్టి రవాణా అడ్డగింత
మోపాల్: మండలంలోని మంచిప్ప పెద్ద చెరువు నుంచి తరలిస్తున్న నల్లమట్టి రవాణాను శనివారం గ్రామస్తులు అడ్డుకున్నారు. చెరువులో ఇష్టారీతిన చేపట్టిన తవ్వకాల వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగే అవకాశముందని వారు ఆరోపించారు. తక్కు వ లోతుతో తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అధిక లోడ్‌తో మట్టిని తరలించడం వల్ల రోడ్లు ధ్వంసం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లమట్టి తరలిస్తున్న వాహనాలను అడ్డుకుని అధికారులకు ఫిర్యాదుచేశారు.
నవీపేట మండలంలో
సైబర్ మోసం
నవీపేట: మండలంలోని పాల్దా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సైబర్ మోసానికి గురైనట్లు తెలిసింది. సదరు వ్యక్తికి రెండు రోజుల కిందట గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మించాడు. మీ ఫోన్ నంబరు వేరే వ్యక్తి ఖాతాకు లింకై ందని, ఇలా జరిగితే జైలు శిక్ష పడుతుందని భయపెట్టించాడు. తమకు డబ్బు పంపితే శిక్ష పడకుండా చూస్తామన్నారు. వెంటనే బాధిత వ్యక్తి ఈనెల 15న కొంత డబ్బును పంపించాడు. మళ్లీ శనివారం ఫోన్ చేసి మరింత డబ్బు పంపాలని బెదిరించడంతో రూ.28వేలు పంపించాడు. ఇలా ఇప్పటి వరకు రూ.లక్షా ఇరవై వేలు ఆన్‌లైన్‌లో పంపించాడు. అనుమానం వచ్చిన సదరు వ్యక్తి కుటుంబ సభ్యులకు తెలుపగా మోసపోయినట్లు తెలుసుకున్నాడు. పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేశాడు.