
సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్ అర్బన్ : ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం తన చాంబర్‌లో సంబంధిత శా ఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వ హించారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఇంటర్ విద్యాధికారి రవికుమార్‌తో కలిసి అదనపు కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి 27 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 18,837 మంది విద్యార్థులు హాజరుకానుండగా, 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల సమయాలకు అనుగుణంగా బస్సుల సదుపాయం కల్పించాలని ఆర్టీసీ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని ట్రాన్స్‌కో అధికారికి సూచించారు. సకాలంలో ప్రశ్నపత్రాలు పరీక్ష కేంద్రాలకు చేరేలా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యార్థులు ముందుగానే తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షలు సజావుగా కొనసాగేలా అందరూ సమన్వయంతో పని చేయాలని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇంటర్ విద్యాధికారి రవికుమార్ మాట్లాడుతూ కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ఆరుగురు సిట్టింగ్ స్క్వాడ్, రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమిస్తున్నామన్నారు. మొత్తం 36 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు, కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేస్తామన్నారు. సమావేశంలో డీఈవో, ట్రాన్స్‌కో, పోస్టల్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు, అదనపు పోలీసు కమిషనర్ బస్వారెడ్డి, ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు చిన్నయ్య, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్