
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సి పల్ పరిధిలోని మామిడిపల్లిలో చోరీకి యత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అయ్యప్ప ఆలయం, రేణుక ఎల్లమ్మ గుడి హుండీ తాళాలు ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించిన యువకుడిని శుక్రవారం స్థానికులు పట్టుకున్నారు. ఆ యువకుడు గతంలో కూడా ఇటువంటి ప్రయత్నం చేసినట్టు స్థానికులు తెలిపారు. అనంతరం నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
కట్టెల సరఫరా పేరిట టోకరా
కామారెడ్డి క్రైం: ఆర్మీ క్యాంపునకు పొయ్యిల కట్టెలు సరఫరా చేసే కాంట్రాక్టు ఉందని నమ్మించి రూ.39,829కు టోకరా వేశారు ఆన్‌లైన్ మోసగాళ్లు. ఈ ఘటన శుక్రవారం దేవునిపల్లిలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన సిరికొండ సుదర్శన్‌కు మార్చి 30న ఓ వ్యక్తి ఫోన్ చేసి నిజామాబాద్‌లో ఆర్మీ కాంపునకు పొయ్యిల కట్టెలు సరఫరా చేసే కాంట్రాక్టు ఉందని నమ్మించాడు. అందుకోసం వాట్సప్‌లో లోకేషన్ పంపించి కట్టెలు పంపించుమన్నాడు. మాయ మాటలు చెప్పి విడతల వారిగా డిపాజిట్ పేరిట రూ.39,829ను ఆన్‌లైన్ ద్వారా వేయించుకున్నారు. కట్టెలు డెలవరీ కాకపోవడంతో మోపోసపోయినట్లు గుర్తించిన బాధితుడు శుక్రవారం దేవునిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రసాద్ తెలిపారు.
సైబర్ నేరాలపై
జాగ్రత్తగా ఉండాలి
సిరికొండ : సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్సై నర్సింలు తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫాం అనే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు హరిణి, అక్షయ, నిత్యశ్రీ, గుణకరణ్‌లను సైబర్ అంబాసిడర్స్‌గా ఎంపిక చేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. విద్యార్థులకు అంబాసిడర్స్ బ్యాడ్జీలను ఎస్సై ప్రధానం చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.