పసుపునకు ప్రత్యేక బోర్డు లేదు

మోర్తాడ్‌లో సాగవుతున్న పసుపు పంట(ఫైల్‌) - Sakshi

మోర్తాడ్‌: పసుపు బోర్డు ఏర్పాటుకు ఎలాంటి ప్రతిపాదన లేదని స్పైసిస్‌ బోర్డులోనే పసుపు ఒక భాగం అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి అనుప్రియా పాటిల్‌ లోక్‌సభలో మరోసారి స్పష్టం చేయడంతో పసుపు రైతుల ఆశలపై నీళ్లు చల్లినట్‌లైంది. పసుపు అధికంగా సాగు చేస్తున్న నిజామాబాద్‌ జిల్లాలో బోర్డు ఏర్పాటు చేయాలని రైతులు మొదటి నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. మిర్చి, తంబాకు పంటలకు ప్రత్యేకమైన బోర్డులు ఉన్నట్లు పసుపు పంటకు బోర్డు ఉంటే సాగు విస్తీర్ణం నియంత్రణలో ఉంటుందని రైతులు చెబుతున్నారు. పసుపు సాగులో మెళకువలు నేర్పించడం, మేలు రకమైన విత్తనాలు అందుబాటులోకి తీసుకరావడం, పంటకు ధర నిర్ణయం, పసుపు ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటు ఇలా ఎన్నో రకాల ప్రయోజనాలు బోర్డుతోనే సాధ్యమవుతాయని రైతులు వెల్లడిస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సైతం ఎంపీగా పోటీచేసి గెలిచిన అర్వింద్‌ బోర్డు ఏర్పాటుకు కట్టుబడి ఉన్నానని హామీ ఇచ్చారు. ఎన్నికల తర్వాత పసుపు బోర్డుకంటే మెరుగైన సేవలు, సౌకర్యాలను కల్పించే స్పైసిస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేయించానని ఎంపీ స్పష్టం చేశారు. కొంత కాలంగా పసుపు బోర్డు గురించి ఎంపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. తాజాగా పార్లమెంట్‌ సమావేశాల్లో తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్‌ ఎంపీలు వెంకటేష్‌ నేత, పసునూరి దయాకర్‌, డాక్టర్‌ రంజిత్‌రెడ్డి, మాలోతు కవిత పసుపు బోర్డు అంశాన్ని చర్చకు తీసుకవచ్చారు. దీనికి వాణిజ్య, పరిశ్రమల సహాయ మంత్రి సమాధానం ఇస్తూ పసుపు బోర్డు ఏర్పాటు ప్రతిపాదన ఏది లేదని తెలిపారు. 52 రకాల సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన స్పైసిస్‌ బోర్డు ఒక్కటే పని చేస్తుందని పసుపు ఇందులో భాగం అని వెల్లడించారు. దీంతో పసుపు బోర్డు ప్రతిపాదన ఏది కేంద్రం దృష్టిలో లేదని తేటతెల్లమైంది. పసుపు బోర్డు ఏర్పాటుపై కేంద్రానికి ఆసక్తి లేదని తెలియడంతో రైతులు అసంతృప్తికి గురవుతున్నారు. తమ చిరకాల వాంచైన పసుపు బోర్డు ఏర్పాటు చేయకపోవడంపై రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

స్పైసిస్‌ బోర్డులో భాగమే..

లోక్‌సభలో వెల్లడించిన వాణిజ్య,

పరిశ్రమల సహాయ మంత్రి అనుప్రియ

బోర్డు ఏర్పాటు కాకపోతే తమకు

ప్రయోజనం లేదంటున్న రైతులు

కేంద్రం పునరాలోచన చేయాలి

పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని కేంద్రం పట్టించుకోకపోవడం సరికాదు. ఎంతో మంది రైతుల ప్రయోజనాల కు సంబంధించిన విషయంలో ప్రభుత్వం పట్టింపు లేకుండా ఉండటం సరైంది కాదు. పసుపు బోర్డును ఏర్పాటు చేయకపోతే రైతులు ఉద్యమిస్తారు.

– గడ్డం లింగారెడ్డి, రైతు, గుమ్మిర్యాల్‌

ఎంపీ మాట తప్పారు

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా నని హామీ ఇచ్చి ఎంపీ అయి న అర్వింద్‌ ఇప్పుడు మాట తప్పడం సరికాదు. పసుపు రైతులు ఎన్నో ఏళ్లుగా బోర్డు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. బోర్డు ఏర్పాటుతోనే పసుపు సాగు చేసే రైతుల కష్టాలు తీరుతాయి.

– దొన్కల్‌ సంజీవరెడ్డి, రైతు నాయకుడు

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top