నిజామాబాద్‌అర్బన్: మెడికల్ కళాశాల విద్యార్థి సనత్ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు వేణురాజ్ డిమాండ్ చేశాడు. శుక్రవారం మెడికల్ కళాశాలలో విద్యార్థి మృతి చెందిన హాస్టల్‌ను సందర్శించి అనంతరం మాట్లాడారు. నెలరోజుల క్రితమే హర్ష అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పుడు సనత్ మృతి చెందాడన్నారు. గతంలోనే కళాశాలలో సీ సీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదన్నారు. విద్యార్థి మృతిపై తమకు అనుమానాలున్నాయన్నారు. నాయకులు సయ్యద్ అష్రఫ్, లక్ష్మణ్ వర్మ పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆత్మహత్యలకు నిలయంగా మారుతుందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రాచకొండ విగ్నేష్ ఒక ప్రకటనలో విమర్శించారు.
నిజామాబాద్‌అర్బన్: మెడికల్ కాలేజీలో సనత్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో పీడీఎస్‌యూ నాయకులు మెడికల్ కాలేజీకి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్క గణేష్ మాట్లాడుతూ.. వరంగల్ మెడికల్ కాలేజీ విద్యార్థి ధరావత్ ప్రీతి మృతి, నిజామాబాద్‌లో హర్ష మృతి ఘటన మరువకముందే అదే కళాశాలలో చదువుతున్న సనత్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. మెడికోల ఆత్మహత్యలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మహిపాల్, రాజేష్ పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్‌అర్బన్: మెడికల్ కళాశాలలో విద్యార్థి మృతిపై విచారణ జరిపించాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు సందగిరి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కళాశాలలో విద్యార్థి సనత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకొని కళాశాలకు వెళ్లి పరిశీలించారు. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. కళాశాలలో తరచూ ఇలాంటి ఘటనలు జరగడం విస్మయానికి గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మానసిక వికాస శిక్షణ తరగతులను పెట్టాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎర్రం సుధీర్, పిల్లి శ్రీకాంత్, దాత్రిక రమేష్, సాయి, మేదరి శేఖర్ పాల్గొన్నారు.
నిజాంసాగర్ కాలువలో బాలుడి గల్లంతు
నస్రుల్లాబాద్: మండలంలోని బొమ్మన్‌దేవ్‌పల్లిలో గల నిజాంసాగర్ ప్రధాన కాలువలో ఓ బాలుడు (8) శుక్రవారం గల్లంతయ్యాడు. బాలుడి తాత ఇప్పిర్గా సాయిలు చనిపోవడంతో తల్లితో కలిసి గ్రామానికి వచ్చాడు. బట్టలు ఉతకడానికి వెళ్లిన కుటుంబ సభ్యులతో వెళ్లిన బాలుడు కాలు జారి కాలువలో పడ్డాడు. గజ ఈతగాళ్లతో గాలించినా ఆచూకీ లభించలేదు. దీనిపై పోలీసులను వివరాలు అడగ్గా తమకు ఎటువంటి సమాచారం లేదన్నారు.