డిచ్‌పల్లి : భక్తుల కొంగుబంగారం భద్రాద్రి సీతారామచంద్రస్వామి కల్యాణ తలంబ్రాలను ఇంటివద్దకే అందించేందుకు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ (కార్గో) ద్వారా ప్రారంభించిన సేవలకు భక్తుల నుంచి పెద్దఎత్తున స్పందన లభిస్తుందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా డిచ్‌పల్లి ఖిల్లా రామాలయంపై ఆర్టీసీ గురువారం తలంబ్రాల బుకింగ్ కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. స్వామి వారి కల్యాణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఈ కౌంటర్ వద్దకు వచ్చి సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేవలం రూ.116 చెల్లిస్తే భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి కల్యాణ తలంబ్రాలు మీ ఇంటి వద్దే అందుకునే అవకాశం ఆర్టీసీ కల్పించిందన్నారు. కల్యాణ తలంబ్రాలు బుక్ చేసుకున్న భక్తులకు రసీదులు అందజేశారు. 150 మంది భక్తులు రూ.116 చొప్పున మొత్తం రూ.17,400 చెల్లించినట్లు కార్గో ఇన్‌చార్జి మురళి తెలిపారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్లు చందర్, దాసు పాల్గొన్నారు.