బెట్టింగ్‌ భూతానికి బలి! | - | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ భూతానికి బలి!

Mar 31 2023 1:30 AM | Updated on Mar 31 2023 1:30 AM

- - Sakshi

నందిపేట్‌: కోట్లకు పడగెత్తాలనే అత్యాశతో ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడుతున్న యువకుల జీవితాలు అంధకారమవుతున్నాయి. బంధువులు, స్నేహితుల వద్ద చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు పరారవుతున్నారు. దీంతో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఇలాంటి సంఘటనలు నందిపేట, డొంకేశ్వర్‌ మండలాల్లో వెలుగు చూస్తున్నాయి.

పరారీలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు

భావితరానికి సన్మార్గం చూపాల్సిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు అత్యాశకు పోయి ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడి రూ. 3 కోట్ల బాకీలు చేసి పరారయ్యాడు. నందిపేటకు చెందిన ఓ ఉపాధ్యాయుడు కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను వడ్డీ వ్యాపారం సైతం చేసేవాడు. బెట్టింగులకు అలవాటు పడి మెసానికి గురవుతు వచ్చాడు. ముందుగా తన తండ్రి నుండి రూ. 70 లక్షలు తీసుకుని వ్యాపారం చేస్తానని నమ్మించాడు. తర్వాత తన తండ్రి సోదరులైన ఇద్దరి నుంచి రూ.55 లక్షలు తీసుకున్నాడు. అంతేకాకుండా తోటి ఉపాధ్యాయుల వద్ద, స్నేహితుల వద్ద లక్షల రూపాయలు బాకీ చేశాడు. సహ ఉపాద్యాయురాలైన ఓ మహిళా రూ. 15 లక్షలతో పాటు ఇంటి కాగితాలు ఇచ్చినట్లు సమచారం. అందరి దగ్గర సుమారు రూ. 3 కోట్ల పై చిలుకు బాకీ తీసుకుని బెట్టింగులో పోగోట్టుకుని ఏమి చేయాలో తెలియక పరారయ్యాడు.

మరో యువకుడి ఆత్మహత్య

ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడి రూ. 2 కోట్ల పైచిలుకు బాకీలు చేసి నందిపేటకు చెందిన ఓ యువకు డు అప్పులు తీర్చలేక ఆరునెలల క్రితం ఆత్మహత్య కు పాల్పడ్డాడు. అలాగే నందిపేటలోని రాజనగర్‌ కాలనీకి చెందిన మరో యువకుడు రూ.2 కోట్ల అప్పు చేశాడు బకాయిలు తీర్చమని బాకీలు ఇచ్చిన వారు వెంటపడడంతో పరారయ్యాడు. పరారీలో ఉన్న అతనిని పట్టుకు వచ్చిన తండ్రి తనకు ఉన్న పొలాలను, ప్లాట్లను అమ్మి అప్పులు తీర్చాడు.

బర్త్‌డే అని చెప్పి..

డొంకేశ్వర్‌ మండలంలోని గంగసముందర్‌ గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆన్‌లైన్‌ బెట్టింగులో రూ. 70 లక్షల పైచిలుకు పోగోట్టుకున్నాడు. అంతేకాకుండా హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ చదువుతున్న తన బంధువుల అమ్మాయిల దగ్గర నుంచి తన బర్త్‌డే అని బంగారు గొలుసులు తీసుకొని అమ్ముకున్నట్లు సమాచారం.

తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు

ఆన్‌లైన్‌ బెట్టింగులకు పాల్పడుతూ మోసాలు గురువుతున్న యువకుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. యువకులు చేసిన పాపాలకు తల్లిదండ్రు లు తల్లడిల్లిపోతున్నారు. తన పిల్లలు చేసిన బాకీలు తీర్చే పరిస్థితి లేక తల్లిదండ్రులు తలదించుకునే పరిస్థితి నెలకొంది. పైసా పైసా పోగు చేసి డబ్బులు పెరుగుతాయనే ఆశతో అప్పులు ఇచ్చిన వారు సైతం తిరిగి రాక ఇబ్బందులు పడుతున్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు

బానిసవుతున్న యువత

అంధకారమవుతున్న జీవితాలు

అప్పులు తీర్చలేక ఆత్మహత్య

చేసుకుంటున్న వైనం

రోడ్డున పడుతున్న కుటుంబాలు

అత్యాశతో బెట్టింగులు

అత్యాశతో యువకులు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కరోనా కాలంలో లాక్‌డౌన్‌ సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల కోసం స్మార్టుఫోన్లకు అలవాటు పడిపోయారు. ఫోన్లలో వచ్చిన కొత్త కొత్త ఆప్‌లకు అలవాటుపడి బెట్టింగులకు పాల్పడి మోసాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు సైతం పట్టించుకోవడం లేదు. ఆన్‌లైన్‌ ఆప్‌ల ద్వారా మోసపోకుండా పోలిసుల కళాబృందం వారి అవగాహాన కల్పిస్తున్నాం. మోసపోయివారు ఎవరైన పిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– శ్రీకాంత్‌, నందిపేట ఎస్సై

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement