
చెరువులో స్నానం చేసి అప్పటి వరకు ధరించిన వస్త్రాలను అక్కడే వదిలేసి
నిజామాబాద్: భూత వైద్యుడు చెప్పిన మాటలు విని చెరువులో స్నానానికి వెళ్లిన ఓ మహిళ నీట మునిగి చనిపోయింది. ఈ ఘటన బుధవారం మండలంలోని ఒడ్డెట్‌పల్లి గ్రామంలో జరిగింది. మాక్లూర్ ఎస్సై యాదగిరిగౌడ్ కథనం ప్రకారం.. ఒడ్డెట్‌పల్లి గ్రామానికి చెందిన గోదూరి భూదేవి (45) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. కుటుంబ సమస్యలు కూడా ఎక్కువ అవుతుండటంతో తట్టుకోలేక ఓ భూత వైద్యుడిని ఆశ్రయించింది.
అతడు ఓ మందు ఇచ్చి బుధవారం తెల్లవారక ముందే సేవించాలని చెప్పాడు. అంతే కాకుండా చెరువులో స్నానం చేసి అప్పటి వరకు ధరించిన వస్త్రాలను అక్కడే వదిలేసి నూతన వస్త్రాలను కట్టుకోని తిరిగి ఇంటికి వెళ్లాలని సూచించాడు. భూదేవి భూతవైద్యుడి సూచన మేరకు బుధవారం చెరువులో స్నానానికి వెళ్లి నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి భర్త ఒడ్డెన్న, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరు దుబాయిలో ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపారు.