ప్రైవేట్ హాస్పిటల్స్-హోటల్స్ వ్యాక్సినేషన్ ఆఫర్లు కుదరవు

కరోనా టైంలో విలాసవంతమైన హోటల్స్ ఐసోలేషన్ సెంటర్లుగా మారిపోయాయి. ఈమధ్య అయితే ఏకంగా వ్యాక్సిన్ డోసులూ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్ పేరిట స్పెషల్ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్ సహా దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో చేతులు కలిపి లగ్జరీ హోటల్స్ ఈ దందాను నడిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్నెర చేసింది.
న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్పత్రులు, హోటల్స్తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్ దందాలను సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్, వ్యాక్సినేషన్ గైడ్లెన్స్ కూడిన లేఖల్ని శనివారం పంపించారు.
Health Ministry writes to States/UTs on some private hospitals giving package for #COVID19 Vaccination in collaboration with some hotels.
Says it is against the guidelines issued for the National Covid Vaccination Program. pic.twitter.com/qum9SqOJtW— Ministry of Health (@MoHFW_INDIA) May 29, 2021
ఈమధ్య కొవిడ్ వ్యాక్సినేషన్ ప్యాకేజీల పేరుతో లగ్జరీ హోటల్స్ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజులకి, ఫలానా రేటంటూ ప్రకటించుకుంటున్నాయి. ఫుడ్, బెడ్, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించి కస్టమర్లకు వ్యాక్సిన్ డోసులు అందిస్తున్నాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ తరుణంలోనే కేంద్రం స్పందించింది. స్టార్ హోటళ్లలో టీకాలు వేయడం రూల్స్ విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసేలా చూడాలని, అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి గట్టిగానే సూచించారు. కాగా, ఒకవైపు వ్యాక్సిన్ కొరత కొనసాగుతున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులు అందించడంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఆదేశాలు కొంచెం ఊరట ఇచ్చే అంశమే. ఇప్పటిదాకా మన దేశంలో 21 కోట్ల డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
ఎక్కడెక్కడంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, వర్క్ ప్లేసులు, వయసు మళ్లినవాళ్ల కోసం హోం కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లు, గ్రూప్ హౌజింగ్ సొసైటీల దగ్గర వైకల్యం ఉన్నవాళ్లకు, ఆర్డబ్ల్యూఏ ఆఫీసుల్లో, కమ్యూనిటీ సెంటర్లలో, పంచాయితీ భవన్లలో, విద్యా సంస్థల్లో, ఓల్డ్ ఏజ్ హోమ్స్లో టెంపరరీ బేస్ మీద వ్యాక్సిన్ అందించాలని కేంద్రం గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్ డ్రైవ్ను నిశితంగా పరిశీలించాలని, అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సూచించింది.