వివాదాస్పదం: అక్కడ తాకితే నేరం కాదు

Skin to skin contact not sexual assault under Pocso Act Says Bombay HC - Sakshi

సాక్షి, ముంబై : బాలికపై లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పు వివాదాస్పదంగా మారింది. ముంబైకి చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల బాలిక ఛాతిభాగంలో తాకాడని, అంతేకాకుండా బాలిక శరీరంలోని పలు భాగాలపై చేయివేశాడని ఆరోపిస్తూ హైకోర్టులో ఇటీవల ఓ పిటిషన్‌ దాఖలైంది. మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిని పోక్సో చట్టం (లైంగిక వేధింపుల నుంచి చిన్నారుల రక్షణ) కింద శిక్షించాలని పిటిషనర్‌ కోరారు. దీనిపై శనివారం విచారణ చేపట్టిన పుప్ప గనిడేవాలతో కూడిన ఏకసభ్య ధర్మాసనం తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

న్యాయస్థానం తీర్పును వెలువరిస్తూ.. ‘పోక్సో చట్టం ప్రకారం లైంగిక వేధింపులంటే నిందితుడు బాలికను అత్యాచారం చేయడానికి ప్రయత్నించి ఉండాలి. లేకపోతే ఉద్దేశపూర్వకంగా బాలిక ప్రైవేటు భాగాలను తాకాలి. శారీరకంగా వేధింపులకు గురిచేసి ఉండాలి. ఇలాంటి సందర్భాల్లో నిందితుడిని పోక్సో చట్టం ప్రకారం శిక్షించవచ్చు. కానీ తాజా కేసులో నిందితుడు కేవలం బాలికను డ్రెస్‌పై నుంచి మాత్రమే తగిలాడు. లైంగిక దాడికి పాల్పడినట్టు ప్రయత్నం కూడా చేయలేదు. అంతేకాకుండా డ్రస్‌లోపల చేతులు పెట్టి ఎలాంటి భాగాలనూ తాకలేదు. శరీరం-శరీరం తాకినంత మాత్రాన పోక్సో చట్టం ప్రకారం నేరంగా భావించలేం. దానిని ఐపీసీ 354, 342 (మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం, అవమానించడం) వంటి సెక్షన్ల కింద నేరంగా పరిగణించి విచారణ జరపవచ్చు’ అంటూ న్యాయమూర్తి పుష్ప వ్యాఖ్యానించారు. 12 ఏళ్ల బాలిక ఛాతిని డ్రస్‌పై నుంచి తాకినట్టు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా పోక్సో చట్టం నింద నమోదైయ్యే కేసుల్లో ఖచ్చితమైన ఆధారాలు ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. 

మరోవైపు ముంబై హైకోర్టు తీర్పును సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో న్యాయస్థానం ఈ విధమైన తీర్పును ఇవ్వడం సరైనది కాదని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. లైంగిక వేధింపుల కేసులో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సినీనటి తాప్సి పన్ను తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి తీర్పులు విన్న తరువాత తనకు మాటలు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాను. కానీ ఇలాంటి తీర్పుల గురించి తెలిసిన తరువాత ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు’ అంటూ తాప్సి రాసుకొచ్చారు. ఈ మేరకు జూన్ పాల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన ఓ ట్వీట్‌ను ఆమె రీట్వీట్ చేశారు. ఈ తీర్పుపై గాయని చిన్మయి మరింత ఘాటగా స్పందించారు. జూన్ పాల్ ట్వీట్‌నే షేర్ చేసిన చిన్మయి.. ‘మహిళలు ఎదుర్కొనే చట్టం ఇది. అద్భుతంగా ఉంది కదా.. ఈ దేశం లైగింగ వేధింపులకు పాల్పడే వారికోసమే. వారి కోసం వారే ఏర్పాటు చేసుకున్నది’ అంటూ చిన్మయి తన ట్వీట్‌ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top