
విడాకులకు అవి ప్రాతిపదికలే
వైవాహిక వివాదాలపై సుప్రీం స్పష్టీకరణ
న్యూఢిల్లీ: జీవిత భాగస్వాములతో సంభాషణను రహస్యంగా రికార్డు చేయడం విడాకులతో పాటు అన్నిరకాల వైవాహిక వివాదాల్లోనూ సాక్ష్యాలుగా చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ధర్మాసనం సోమవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. సదరు సంభాషణలకు సాక్ష్యాల చట్టంలోని 122వ సెక్షన్ కింద రక్షణ ఉంటుందని, కనుక వాటిని న్యాయ వివాదాల్లో ఉపయోగించడాన్ని అనుమతించలేమని పంజాబ్, హరియాణా హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
వాటిని సాక్ష్యాలుగా అనుమతిస్తే వైవాహిక బంధాన్ని, కుటుంబంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, భాగస్వామిపై గూఢచర్యానికి దారి తీస్తాయని హైకోర్టు వెలువరించిన అభిప్రాయాలతో ధర్మాసనం విభేదించింది. ‘‘ఇలాంటివి చెల్లుబాటయ్యే వాదనలు కావన్నది మా అభిప్రాయం. భార్యాభర్తలు పరస్పరం తరచూ ఇలా సంభాషణను గుట్టుగా రికార్డు చేయడం వంటి పనులకు పాల్పడుతున్నారంటేనే ఆ బంధం బీటలు వారిందని, వారి మధ్య విశ్వాసం సన్నగిల్లిందని అర్థం. కనుక అలాంటి పరిస్థితుల్లో గోప్యంగా రికార్డు చేసిన భాగస్వామి తాలూకు సంభాషణను సాక్ష్యంగా అంగీకరించడం అసమంజమేమీ కాదు.
ఎందుకంటే అది వైవాహిక సమస్యల తాలూకు ఫలితమే తప్ప వాటికి కారణం కాదు’’ అని జస్టిస్ నాగరత్న స్పష్టం చేశారు. ‘‘122వ సెక్షన్ పేర్కొంటున్న గోప్యత హక్కు భార్యాభర్తల సంభాషణలకు కూడా వర్తిస్తుందన్నది నిజమే. కానీ అది సంపూర్ణమైనది కాదు. ఈ అంశాన్ని ఆ సెక్షన్‌కు ఇచ్చిన మినహాయింపులతో కలిపి చూడాల్సి ఉంటుంది’’ అని ధర్మాసనం పేర్కొంది.
‘‘ఇలాంటి విషయాల్లో గోప్యత హక్కు కంటే కూడా సక్రమ విచారణ హక్కుదే పై చేయి అవుతుంది. వైవాహిక బంధం విచి్ఛన్నమయ్యే స్థితికి చేరినప్పుడు భాగస్వాములకు తమ వాదనను రుజువు చేసే సాక్ష్యాలు సమరి్పంచే హక్కును గోప్యత తదితరాలను ప్రాతిపదికగా చూపి కాలరాయలేం’’ అని స్పష్టం చేసింది. 2017 నాటి ఓ విడాకుల కేసులో భార్యకు తెలియకుండా భర్త జరిపిన ఆమె సంభాషణల రికార్డులను సాక్ష్యంగా అనుమతిస్తూ పంజాబ్‌లోని భటిండా ఫ్యామిలీ కోర్టు ఇచి్చన తీర్పును పునరుద్ధరించింది.