కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాల్సిందే

SC Gives Centre 6 Weeks to Decide Ex Gratia Compensation for Kin of Covid Victims - Sakshi

కరోనా మృతుల కుటుంబాల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశం 

కనీస ప్రామాణిక ఆర్థిక సాయం అందించండి 

ఆరు వారాల్లోగా మార్గదర్శకాలు జారీ చేయండి 

పరిహారాన్ని ఖరారు చేయడంలో ఎన్‌డీఎంఏకు స్వేచ్ఛ

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారికి కనీస ప్రామాణిక ఆర్థిక సాయం అందించాలని పేర్కొంది. దీనిపై ఆరు వారాల్లోగా నూతన మార్గదర్శకాలు జారీ చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీని(ఎన్‌డీఎంఏ) ఆదేశించింది. బాధితులకు ఉపశమనం కలిగించాల్సిన ఎన్‌డీఎంఏ తన విధుల్లో విఫలమైందని న్యాయస్థానం ఆక్షేపించింది. కరోనా వల్ల మృతి చెందితే మరణ ధ్రువీకరణ పత్రాల్లో ఈ విషయం స్పష్టంగా పేర్కొనాలని సూచించింది. కరోనా మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లపై జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ ఎంఆర్‌ షాలతో కూడిన సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం తీర్పు వెలువరించింది.  

సుప్రీంకోర్టు తీర్పులోని ప్రధానాంశాలు 
బాధిత కుటుంబాలకు ఫలానా మొత్తమే చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని కోర్టు నిర్దేశించలేదు. నిధులు, వనరుల లభ్యతలను దృష్టిలో పెట్టుకొని కనీస ప్రామాణిక ఆర్థిక సాయాన్ని పరిహారంగా ఖరారు చేయాలి. ఇది సమంజసంగా ఉండాలి. 
కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వడానికి జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (ఎన్‌డీఎంఏ) మార్గదర్శకాలు రూపొందించాలి. విపత్తు నిర్వహణ అథారిటీ–2005 సెక్షన్‌ 12(3) ప్రకారం కనీస పరిహారం అందించాలి. పరిహారంగా ఎంతమొత్తం ఇవ్వాలనేది ఎన్‌డీఎంఏ నిర్ణయించుకోవచ్చు. ఈ మేరకు నూతన మార్గదర్శకాలను ఆరు వారాల్లోగా జారీ చేయాలి. 
ఎవరు ఏ కారణంతో మరణించారో డెత్‌ సర్టిఫికెట్లలో స్పష్టంగా పేర్కొనాలి. కరోనాతో మృతి చెందితే కోవిడ్‌–19తో అని సంబంధిత అథారిటీ మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. ఒకవేళ అథారిటీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం పట్ల కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపినా, మృతికి కారణం పట్ల సంతృప్తి చెందకపోయినా సంబంధిత మార్పులు చేయాలి. 
కోవిడ్‌–19 మరణాల విషయంలో డెత్‌ సర్టిఫికెట్ల జారీని మరింత సరళతరం చేయాలి. ఆ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలి. 
15వ ఆర్థిక సంఘం సూచించినట్లుగా కాటికాపరుల కోసం ఒక బీమా పథకాన్ని రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి.  

చదవండి: ఒకే దేశం–ఒకే రేషన్‌ కార్డు 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top