త్వరలో పెట్రోల్‌ మోత! | RBI Governor Sanjay Malhotra comments On Petrol price hike | Sakshi
Sakshi News home page

త్వరలో పెట్రోల్‌ మోత!

May 14 2026 5:41 AM | Updated on May 14 2026 5:41 AM

RBI Governor Sanjay Malhotra comments On Petrol price hike

పరిస్థితి ఇలాగే ఉంటే రేట్ల పెంపు తప్పకపోవచ్చు 

ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా

న్యూఢిల్లీ: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ ధరలు స్థిరంగానే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో యుద్ధం ఇంకా కొనసాగితే దశలవారీగా ధరలు పెరగొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. అంటే త్వరలోనే సామాన్య ప్రజల ఖర్చులపై అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో సంక్షోభ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ రేట్లను పెంచాల్సి రావొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా తాజాగా వ్యాఖ్యానించారు. ముడిచమురు, ఎరువుల కోసం భారత్‌ దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉన్న నేపథ్యంలో కొంత భారాన్ని బదలాయించడం తప్పకపోవచ్చని ఆయన తెలిపారు. సరఫరాపరమైన అవాంతరాలు ఇప్పుడిప్పుడే భారత్‌పై ప్రభావం చూపించడం మొదలవుతోందని స్విట్జర్లాండ్‌లో ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మల్హోత్రా చెప్పారు. ఫిబ్రవరిలో అమెరికా, ఇజ్రాయెల్‌– ఇరాన్‌ మధ్య యుద్ధం ప్రారంభమయ్యాక ముడిచమురు ధరలు అంతర్జాతీయంగా భారీ స్థాయిలో ఎగిసినప్పటికీ దేశీయంగా మాత్రం ప్రభుత్వం రిటైల్‌ పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెంచకుండా యథాతథంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. 

కానీ, క్రూడాయిల్‌ రేట్లు పెరుగుతూ, రూపాయి విలువ పడిపోతూ, చమురు దిగుమతుల భారం తడిసి మోపెడవుతుండటంతో ధరల పెంపు తప్పకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మల్హోత్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు ఇప్పటివరకు ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెరిగిన చమురు ధరల భారాన్ని భరిస్తున్నాయి, కానీ అవి ఇంకెంతకాలం నష్టాలను భరించగలవో ఆందోళన కలిగిస్తోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి కూడా వ్యాఖ్యానించడం.. త్వరలో పెట్రోల్‌ ధరలు పెరగక తప్పదనే అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) కూడా పెరిగిన ముడి చమురు ధరలను వినియోగదారులపై కొంతవరకు మోపాల్సిందేనని అభిప్రాయపడింది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని భారత్‌కు తట్టుకునే సామర్థ్యం ఉందని పేర్కొంది.   

Advertisement
 
Advertisement
Advertisement