గణనీయంగా తగ్గిన వాహనాల సంఖ్య
గుజరాత్, అస్సాం పర్యటనల్లో పరిమిత సంఖ్యలోనే..
మోదీ బాటలో నడుస్తున్న బీజేపీ ముఖ్యమంత్రులు
ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని ప్రజలకు పిలుపు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు బీజేపీ ముఖ్యమంత్రులు, నాయకులు పొదుపు చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని మోదీ ఇటీవల హైదరాబాద్ పర్యటనలో పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు. ఇటీవల దేశీయ పర్యటనల్లో ఈ మార్పు కనిపించింది. ఎస్పీజీ ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన భద్రతా అంశాలను కొనసాగిస్తూనే వాహనాల తగ్గింపు జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
హైదరాబాద్ పర్యటన తర్వాత గుజరాత్, అస్సాం పర్యటనల్లో మోదీ వాహన శ్రేణిలో వాహనాలు తగ్గిపోయాయి. కాన్వాయ్‌ని 50 శాతానికి కుదించాలని, సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిక్ వాహనాలను చేర్చాలని ప్రధానమంత్రి ఆదేశించినట్లు అధికారులు చెప్పారు. శిలాజ ఇంధనాలతో నడిచే కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దని సూచించినట్లు తెలిపారు. అయితే, కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించినప్పటికీ ప్రధాని భద్రత విషయంలో ఎలాంటి తగ్గింపు లేదని ఎస్పీజీ వర్గాలు పేర్కొన్నాయి.
ప్రధానమంత్రి పిలుపునకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. తనతోపాటు రాష్ట్ర మంత్రుల కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను 50 శాతం తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇంధన వినియోగంలో తెలివిగా వ్యవహరించాలని ప్రజలను కోరారు. తన కాన్వాయ్ పరిమాణాన్ని కనిష్ట స్థాయికి తగ్గించుకుంటున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. మంత్రులు సైతం ఇదే బాటలో నడవాలని సూచించారు. ఇంధన పొదుపునకు ప్రాధాన్యం ఇవ్వాలని, వ్యక్తిగత వాహనాలను పక్కనపెట్టి, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. వాహనాలతో ర్యాలీలు చేయొద్దన్నారు.
బస్సులు, మెట్రో సేవలను ఉపయోగించుకోవాలి
ఢిల్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఉపయోగించే అధికారిక వాహనాలపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా పరిమితులు విధించారు. ప్రైవేట్ వాహనాలకు బదులుగా కార్‌పూలింగ్ విధానం పాటించాలని, బస్సులు, మెట్రో సేవలను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ నగర ప్రజలను కోరారు. రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ కూడా తన కాన్వాయ్‌ని తగ్గించాలని, ముఖ్యంగా భద్రతాపరమైన అంశంలో అనవసరంగా వాహనాలను ఉపయోగించకూడదని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సహా అధికారులు, ప్రజాప్రతినిధులందరూ పొదుపు చర్యలపై వెంటనే దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. అధికారిక పర్యటనల కోసం విమానాలను ఉపయోగించే ముందు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నుంచి ముందస్తుగా అనుమతి పొందాలని మహారాష్ట్ర ప్రభుత్వం మంత్రులకు సూచించింది. తాను ఇకపై హెలికాప్టర్లు, విమానాలకు బదులుగా రైళ్లు, రాష్ట్ర రవాణా సంస్థ బస్సులు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకుంటానని గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ వెల్లడించారు. ఇంధనాన్ని ఆదా చేయడానికి అధికారిక కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గిస్తానని తెలిపారు.
విదేశీ ప్రయాణాలను తగ్గించుకోవాలన్న ప్రధానమంత్రి విజ్ఞప్తి నేపథ్యంలో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నట్లు గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్‡్ష సంఘ్వీ పేర్కొన్నారు. తాను ఉపయోగించే వాహనాల సంఖ్యను సగానికి తగ్గించుకున్నానని, అవసరమైనప్పుడు మాత్రమే అధికారిక పర్యటనలు చేపడతానని బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ చౌదరీ ప్రకటించారు. తన కాన్వాయ్ పరిమాణాన్ని తగ్గించానని, భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి పెడతానని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి తెలిపారు. హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా లోక్ భవన్‌ను ఇంధన పరిరక్షణ ప్రాంతంగా ప్రకటించారు. ఇంధన పొదుపు ఉద్యమానికి నాయకత్వం వహించాలని విశ్వవిద్యాలయాలకు విజ్ఞప్తి చేశారు.


