
కొత్త అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు చేసే సీ–సెక్షన్(కోత) ఆపరేషన్‌తో పోలిస్తే ముందస్తుగా ఒక తేదీ అనుకుని ప్లాన్‌చేసి ఆపరేషన్ చేయించిన సందర్భాల్లో పుట్టిన చిన్నారులకు రక్త క్యాన్సర్ (లుకేమియా) ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. బిడ్డ డెలివరీ సాధ్యంకాక ప్రసవవేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణికి మాత్రమే గతంలో సీ–సెక్షన్ విధానంలో కోతపెట్టి ఆపరేషన్ చేసేవారు.
తదనంతరకాలంలో మంచిరోజు చూసుకుని, మరికొందరు తమకు వీలున్నప్పుడు, మరికొందరు సెలవుతేదీ ఇలా వేర్వేరు కారణాలతో డెలివరీ తేదీని ప్లాన్‌చేసుకునే ధోరణి ఎక్కువైంది. ఇలా ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్ ఆపరేషన్ ద్వారా పుట్టిన చిన్నారులు భవిష్యత్తులో లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు చెప్పారు.
సంబంధిత పరిశోధన తాలూకు వివరాలు ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి. స్వీడన్‌లో మెడికల్ బర్త్ రిజిస్ట్రర్ గణాంకాల ద్వారా సేకరించిన 1982–89, 1999–2015 కాలాల్లో జన్మించిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. వీరిలో 3.75 లక్షల మంది అంటే 15.5 శాతం మంది సీ–సెక్షన్ ద్వారా జన్మించారు. వీరిలో 1,495 మందికి లుకేమియా వ్యాధి సోకింది.
సహజ ప్రసవం ద్వారా పుట్టిన చిన్నారులతో పోలిస్తే సీ–సెక్షన్ ద్వారా జన్మించిన పిల్లల్లో అత్యత తీవ్రమైన లింఫోబ్లాస్టిక్ లుకేమియా వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువ అని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో పరిశోధకురాలు, ఈ పరిశోధనలో కీలక రచయిత క్రిస్టినా ఇమోర్ఫియా క్యాంపిస్టీ చెప్పారు. సహజ ప్రసవ సమయంలో ఒక్కోసారి ఉమ్మనీరు సంచి పగలిపోయి శిశువు బయటికొచ్చే వేళ యోని బ్యాక్టీరియా అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా సోకడం పుట్టినబిడ్డకు ఎంతో మంచిదని సైన్స్ చెబుతోంది. తొలినాళ్లలోనే బ్యాక్టీరియా సోకడంతో భవిష్యత్తులో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య తేడాలను గుర్తించడం, భవిష్యత్తులో అలర్జీలు, ఆటోఇమ్యూన్ వంటి సమస్యలు రావని, చిన్నారుల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదల బాగుంటుందని ఇప్పటికే పలు పరిశోధనలు చెబుతున్నాయి.