Petrol, Diesel Price Hike: RBI Governor Shaktikanta Das Called For Reduced Indirect Taxes On Petrol And Diesel - Sakshi
Sakshi News home page

పెట్రో సెగలపై ఆర్‌బీఐ సంచలన వ్యాఖ్యలు

Published Thu, Feb 25 2021 1:19 PM

Petrol Price Hike: RBI Governor Shaktikanta Das Calls for Reduced Petrol, Diesel Price Hike - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయంగా రికార్డుస్థాయికి చేరుతున్న ఇంధన ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. మండుతున్న పెట్రోధరలపై  ప్రభుత్వాలు సానుకూల పరిష్కారం చూపాలని ఆయన సూచించారు. అధిక ధరలు కార్లు, బైక్‌లను ఉపయోగించే వినియోగదారులను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు తయారీ, రవాణా రంగాలను తీవ‍్రంగా  దెబ్బతీస్తాయంటూ ఆందోళన వ‍్యక్తం చేశారు. ఇది వ్యాపార వ్యయాలను కూడా ప్రభావితం చేస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయ ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నాయి. ప్రజలను, దేశాన్నిఈ భారం నుంచి బయట పడవేసేందుకు అధిక మొత్తంలో  డబ్బు అవసరమని తెలుసు, కానీ ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని  పేర్కొన్నారు.

రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ లీటరు ధర సెంచరీ దాటేసింది. వరుస బాదుడు తరువాత ప్రస్తుతం స్థిరంగా దేశంలోని మెట్రో నగరాల్లో పెట్రో ధరలు కొనసాగుతున్నాయి. ఈ నెల 23న పెట్రోల్ డీజిల్ ధరలు 35 పైసలు చొప్పున పెంపు తరువాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 91 రూపాయల మార్క్‌, ముంబై లో 97 రూపాయల ఎగువకు చేరింది. (మళ్లీ రాజుకున్న పెట్రో సెగ)

మరోవైపు డిజిటల్‌ కరెన్సీ ఆవిష్కారంపై  కసరత్తు చేస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ ప్రకటించారు. డిజిటల్‌ రెవల్యూషన్‌లో తాము వెనకబడి ఉండాలనుకోవడం లేదంటూ క్రిప్టోకరెన్సీ లాంచింగ్‌పై ఇప్పటివరకు వస్తున్న అంచనాలపై క్లారిటీ ఇచ్చారు. బ్లాక్‌చైన్  టెక్నాలజీ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలి.. క్రిప్టోకరెన్సీలకు సంబంధించి తమకు ఆందోళనలు ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్‌ వెల్లడించారు. అయితే తమ డిజిటల్‌ కరెన్సీ ప్రస్తుత క్రిప్టోకరెన్సీ కంటే భిన్నంగా ఉంటుందని పేర్కొన్నారు. క్రిప్టోకరెన్సీలు ఆసియాలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తాయనే ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఆందోళనను ప్రభుత్వానికి తెలియజేశామన్నారు. (బిట్‌కాయిన్‌ బ్యాన్‌?  సొంత క్రిప్టో క‌రెన్సీ )

డిజిటల్ కరెన్సీని బ్యాన్‌ చేయాలి : రాకేష్ ఝున్‌ఝున్‌వాలా
క్రిప్టోకరెన్సీకి డిమాండ్‌ భారీగా పుంజుకున్న నేపథ్యంలో దేశీయ అతిపెద్ద ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలా కూడా క్రిప్టోకరెన్సీ పై కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్ కరెన్సీని బ్యాన్ చేయాలని ఆయన  విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో రెగ్యులేటర్స్  చొరవ తీసుకోవాలన్నారు. అంతేకాదు బిట్ కాయిన్‌లో తాను పెట్టుబడులు పెట్టేది లేదని తెగేసి చెప్పారు. మరోవైపు దేశీయంగా డిజిటల్‌ కరెన్సీ ఆందోళన నేపథ్యంలో ప్రైవేటు క్రిప్టో కరెన్సీ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కాగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పెట్టుబడులతో ఇటీవలి కాలంలోబిట్‌కాయిన్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఆల్‌ టైం గరిష్టాన్ని  తాకింది. దీంతో బిట్‌కాయిన్‌పెట్టుబడులు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరతీసింది. అయితే ధరలు చాలా హైలో ఉన్నాయంటూ ఉన్నట్టుండి ఎలాన్ మస్క్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్‌పై చేసిన ట్వీట్ కారణంగా భారీ నష్టాన్ని మూట గట్టుకున్నారు. దీనికి తోడు యూఎస్ ట్రెజరీ సెక్రటరీ జానెట్ యెల్లెన్ బిట్‌కాయన్‌పై విరుచుకుపడిన నేపథ్యంలో బిట్ కాయిన్ ఏకంగా 17 శాతం క్షీణించి 45వేల డాలర్లకు పడిపోయింది.  (పెట్రో సెగ : కేంద్ర ఆర్థికమంత్రిపై హీరో ఫైర్‌)

Advertisement
Advertisement