యుద్ధం మిగిల్చిన విషాదం | Pakistan shelling and firing wreak havoc in border villages In Kashmir | Sakshi
Sakshi News home page

యుద్ధం మిగిల్చిన విషాదం

May 9 2026 4:19 AM | Updated on May 9 2026 4:19 AM

Pakistan shelling and firing wreak havoc in border villages In Kashmir

ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కశ్మీర్‌ సరిహద్దు గ్రామాలు

మానసిక వేదనలో చిన్నారులు

శాంతి మాత్రమే సరిపోదు.. సన్నద్ధత కావాలంటున్న స్థానికులు

యుద్ధం ఎప్పుడూ విషాదాన్నే మిగుల్చుతుంది. కళ్లముందే సర్వస్వం కాలిపోవడం, ఆత్మీయులను కోల్పోవడం.. ఆర్థికంగానే కాదు, మానసికంగానూ చేసే గాయం అంతా ఇంతా కాదు. ‘ఆపరేషన్‌ సింధూర్‌’సమయంలోనూ పాక్‌ జరిపిన షెల్లింగ్, కాల్పులు సరిహద్దు గ్రామాల్లో వినాశనం సృష్టించాయి. కుటుంబాలకు కుటుంబాలు సర్వం కోల్పోయాయి. ఇళ్లు విధ్వంసమై అనేక కుటుంబాలు నిరాశ్రయమయ్యాయి.

‘ఆపరేషన్‌ సింధూర్‌’తరువాత.. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్‌ వైపు నుంచి భారీ ఫిరంగులు, మోర్టార్‌ షెల్లింగ్‌ జరిగింది. నివాస ప్రాంతాలు, పాఠశాలలు, మతపరమైన కట్టడాలు, వాణిజ్య భవనాలపై షెల్లింగ్‌ జరిగింది. వందలాది కుటుంబాలు తమ ఇళ్లను వదిలి పారిపోయాయి. కాల్పులు జరిగి ఏడాది పూర్తయ్యింది. ఇప్పుడిప్పుడే జనజీవనం క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నది. 

ప్రస్తుతానికి శాంతి నెలకొంది. పిల్లలు బడికి వెళ్తున్నారు. ప్రజలు తమ పొలాల్లో పనిచేస్తున్నారు. కానీ, ఆసంఘర్షణ తాలూకు గాయాలు సరిహద్దు గ్రామవాసుల జీవితాలను ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఉత్తర కశ్మీర్‌లోని ఉరి, బోనియార్‌ నుంచి జమ్మూలోని పూంచ్, రాజౌరి వరకు సరిహద్దు ప్రాంత ప్రజలను భయం, మానసిక క్షోభ ఇంకా వెంటాడుతున్నాయి.  

ఫిరంగి శకలాలతో ఆటలు..  
ఆ నాలుగు రోజుల యుద్ధం పిల్లల మనస్తత్వంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వాళ్లు జోలపాటల కంటే ముందే మోర్టార్‌ షెల్స్‌ శబ్దాన్ని విన్నారు. ఒకప్పుడు బొమ్మలతో ఆడుకున్న పిల్లలు.. ఇప్పుడు మొనదేలిన లోహపు ముక్కలతో ఆడుకుంటున్నారు. షెల్లింగ్, నిరాశ్రయులవ్వడం పిల్లలను మానసిక వేదనకు గురి చేసింది. ఇప్పటికీ పెద్ద శబ్దాలు వినపడితే పిల్లలు భయపడుతున్నారు.

 ఐదేళ్ల అమీరా జాన్, తన ఇంటిపై పడి పేలిన ఫిరంగి గుళ్ల శకలాలను సేకరించి ఒక పెట్టె నిండా నింపింది. ఒకప్పుడు మట్టి బొమ్మలతో ఆడుకున్న చిన్నారి ఇప్పుడు యుద్ధ శకలాలను ఆటవస్తువులుగా మార్చుకుంది. రాళ్లు, మట్టితో కట్టిన వారి ఇంటిపై షెల్లింగ్‌ ఆనవాళ్లు ఇంకా ఉన్నాయి. పగిలిన కిటికీలను పాలిథీన్‌ షీట్లతో కప్పి ఉంచారు. ‘మా ఇంటి మీద షెల్లింగ్‌ తర్వాత నేను ఏడుస్తూ నిద్రపోలేదు. 

నా తోబుట్టువులు, తల్లిదండ్రులతో సురక్షిత ప్రాంతానికి పరుగెత్తా. రాత్రంతా మేం దాక్కునే ఉన్నాం’అని ఆ పీడకలను గుర్తు చేసుకుంది. యుద్ధం నాలుగు రోజుల్లో ముగిసినప్పటికీ, అమీరా లాంటి పిల్లలకు యుద్ధ జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. పూంచ్‌లోనూ షెల్లింగ్‌ తీవ్ర గాయాలను మిగిల్చింది. ఒక దేవాలయం, ఒక గురుద్వారా, ఒక మదర్సా దెబ్బతిన్నాయి. ఇక్కడి అతిపెద్ద మదర్సా జియా–ఉల్‌–ఉలూమ్‌లో ముగ్గురు విద్యార్థు లు, ఉపాధ్యాయుడు మరణించారు.  

బంకర్లు లేవు..  
షెల్లింగ్‌ మానసికంగానే కాదు.. ఆర్థికంగానూ తీవ్ర నష్టం కలిగించింది. ఇళ్లు దెబ్బతిన్న వారిలో చాలామంది ఇప్పటికీ తాత్కాలిక ఆశ్రయాల్లో నివసిస్తున్నారు. బాంబు దాడు ల్లో ధ్వంసమైన తమ ఇళ్లను తిరిగి నిర్మించుకోవడానికి పోరాడుతున్నారు. ‘షెల్లింగ్‌ దాడి జరిగి సరిగ్గా ఏడాది. ఆ భయానక పరిస్థితులు మాకు ఇంకా గుర్తున్నాయి. మా ఇళ్లు ధ్వంసమైంది. వాటి పునరుద్ధరణకు ప్రభుత్వం మొదట రూ.1.30 లక్షలు, ఆ తర్వాత రూ. 2 లక్షలు ఇచ్చింది. దాంతో ఏం చేయగలం? ధ్వంసమైన ఇళ్లను తిరిగి నిర్మించుకోవడానికి ఆ పరిహారం సరిపోదు.

 ఇంకా కూలిన గోడల మధ్యే నివసిస్తున్నాం’అని ఉరి నివాసి తాలిబ్‌ హుస్సేన్‌ అన్నారు. సరిహద్దు గ్రామాల్లో బంకర్లు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. ఆపరేషన్‌ సిందూర్‌ తరువాత ఉరి ఉప–జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో ఒక బంకర్‌ నిర్మించారు. ఇలాంటి బంకర్లు ఇంకా చాలా ఏర్పాటు చేయాల్సి ఉంది. కాల్పులు జరిగినప్పుడల్లా నిర్మించి ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. కానీ, ఆచరణలో లేదు. మళ్లీ ఏ క్షణమైనా కాల్పులు ప్రారంభం కావచ్చని, తమకు బంకర్లు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.  

ఏ క్షణంలోనైనా పరుగెత్తడానికి సిద్ధంగా
‘ఆకాశం నుంచి రాళ్లలా పడ్డ షెల్లుల శబ్దాల ప్రతిధ్వనులు పీడకలల్లా వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ, ఏ క్షణంలోనైనా పరుగెత్తడానికి సిద్ధంగా ఉండాలని రాత్రంతా బట్టలు వేసుకునే ఉంటాను’అని ఉరి తహసీల్‌లోని పరాన్‌పిల్లా గ్రామంలో 5వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల ఉమైర్‌ యూనుస్‌ చెబుతున్నాడు. ఉమైర్‌ తోటి విద్యార్థులూ అంతే దిగ్భ్రాంతికి గురయ్యారు. భయంతో చదువుపై దృష్టి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నారు.

 ‘గతంలోలా చదివినవి గుర్తుంచుకోలేకపోతున్నాను. నా మనసు వేరే ఆలోచనలతో నిండిపోయింది’అని షెల్లింగ్‌ తరువాత బారాముల్లా పట్టణానికి పారిపోయి వచ్చిన సుహానా ఇలియాస్‌ అంటోంది. ‘ఇక్కడి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే సరిహద్దు గ్రామాల్లో విద్య ఇప్పటికే చాలా తక్కువగా ఉంది. మళ్లీ పుంజుకోకపోతే పెద్ద దెబ్బ అవుతుంది. ఈ ప్రాంతం ఇప్పటికే చాలా చూసింది. మా పిల్లల చదువు నాశనం కావడం మాకు ఇష్టం లేదు’అని పాఠశాల నిర్వాహకుడు 35 ఏళ్ల నాసిర్‌ సలీం చెబుతున్నారు.  

సన్నద్ధత లేదు.. 
షెల్లింగ్‌ కారణంగా గతేడాది వ్యవసాయ కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ సీజన్‌లో తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ పరిస్థితుల్లో కేవలం శాంతి మాత్రమే సరిపోదని, సన్నద్ధత ముఖ్యమని, దీర్ఘకాలిక భద్రతా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పూంచ్, రాజౌరిలలో అత్యంత తీవ్రమైన షెల్లింగ్‌ జరిగింది. ‘మేము రాత్రి భోజనం చేస్తుండగా పేలుళ్లు మొదలయ్యాయి. పిల్లలు ఏడుస్తున్నారు. జనం పరుగులు తీస్తున్నారు. 

రాత్రంతా జరిగిన ఆ షెల్లింగ్‌లో మా బంధువును కోల్పోయాం. ఉదయానికల్లా అతడు లేడు.’అని పూంచ్‌ నివాసి ముజఫర్‌ హుస్సేన్‌ కన్నీటి పర్యంతమయ్యారు. షెల్లింగ్‌ సమయంలో గాయపడిన వారిలో ఉరికి చెందిన జీనత్‌ కూడా ఒకరు. ఇల్లు పూర్తిగా కలిపోవడంతో ఆమె ఇంటిని వదిలి పారిపోయారు. పాక్షిక నష్టం కింద ఆమెకు రూ.1.06 లక్షలు, చికిత్స కోసం మరో లక్ష రూపాయలు అందింది. కానీ చికిత్స కోసం కేటాయించిన డబ్బు మందులకే ఖర్చయిపోయింది. ఉండటానికి గూడు లేకుండా పోయిందని దుఃఖిస్తున్నారు.  

పిల్లలను చదివించడమే లక్ష్యంగా 
ఈ నాలుగు రోజుల షెల్లింగ్‌లో ఒక్క పూంచ్‌ జిల్లాలోనే నలుగురు పిల్లలతో సహా 16 మంది మరణించారు. మండి తహసీల్‌లో షాహిదా కౌసర్‌.. కాల్పుల్లో తన భర్త మహమ్మద్‌ అబ్రార్‌ మాలిక్‌ను కోల్పోయింది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి నానా కష్టాలు పడుతోంది. ‘ఆయన డ్రైవర్, మా కుటుంబానికి అతనొక్కడే ఆధారం. ఆ రాత్రి నాకు ఇంకా గుర్తుంది. షెల్లింగ్‌ మొదలైనప్పుడు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడే చనిపోయాడు. మా ఇల్లు కూడా దెబ్బతింది. ఇంటి మరమ్మతులు ఇంకా చేయించుకోలేకపోయాను. నాకు ముగ్గు రు పిల్లలు, అందరూ బడికి వెళ్తున్నారు. వాళ్లను ఉన్నత చదువులు చదివించడమే నా లక్ష్యం’అని కౌసర్‌ చెబుతోంది. 
     
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement