
సమావేశంలో రాధాకృష్ణన్‌ను సన్మానిస్తున్న ప్రధాని మోదీ, మంత్రులు రాజ్‌నాథ్, అమిత్ షా, జేపీ నడ్డా
సింధూ నది జలాల ఒప్పందంతో భారత్‌కు తీవ్ర నష్టం
80 శాతం జలాలను పాకిస్తాన్‌కు అప్పగించారు
నెహ్రూ హయాంలో జరిగిన తప్పిదాలను సరి చేస్తున్నాం
ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడి
సి.పి.రాధాకృష్ణన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుందామని.. సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి
న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ సొంత ప్రతిష్ట పెంచుకోవడానికి దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడ్డారని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. పాకిస్తాన్‌తో నెహ్రూ కుదుర్చుకున్న సింధూ జలాల ఒప్పందంతో మనకు పూడ్చలేని నష్టం జరిగిందన్నారు. అప్పటి మంత్రివర్గాన్ని గానీ, పార్లమెంట్‌ను గానీ విశ్వాసంలోకి తీసుకోకుండా ఈ ఒప్పందంపై ఆమోదముద్ర వేశారని విమర్శించారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్డీఏ ఎంపీలకు మోదీ పిలుపునిచ్చారు.
దేశానికి.. ప్రధానంగా రైతన్నలకు నష్టం చేకూర్చేలా నెహ్రూ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను తాము అధికారంలోకి వచి్చన తర్వాత నిలిపివేశామని గుర్తుచేశారు. నెహ్రూ నిర్వాకం వల్ల రెండుసార్లు దేశ విభజన జరిగిందన్నారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో భారత్‌ను విభజించారని, సింధూ నదిని ముక్కలు చేసి దేశాన్ని మరోసారి విభజన తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. అధికార ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సి.పి.రాధాకృష్ణన్‌ను ప్రధాని మోదీ మంగళవారం ఎన్డీయే ఎంపీలకు పరిచయం చేశారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ఆధ్వర్యంలో రాధాకృష్ణన్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఏం చెప్పారంటే...
రాద్ధాంతం ఎందుకని దబాయింపు
‘‘సింధూ నదిలో 80 శాతానికి పైగా నీటిని పాకిస్తాన్‌కే అప్పగించారు. మన రైతులను దగా చేశారు. అప్పటి జనసంఘ్ ఎంపీ అటల్ బిహారీ వాజ్‌పేయి సహా పలువురు పార్లమెంట్ సభ్యులు నెహ్రూ నిర్ణయాన్ని తప్పుపట్టారు. నిరసన వ్యక్తంచేశారు. దీనిపై పార్లమెంట్‌లో రెండు గంటలపాటు చర్చ జరిగింది. కొన్ని బకెట్ల నీరు పోతే రాద్ధాంతం ఎందుకని నెహ్రూ దబాయించారు. పైగా లద్ధాఖ్‌లో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటే చూసీచూడనట్లు వదిలేశారు. అక్కడ గడ్డి పరక కూడా పెరగదని వ్యంగ్యంగా మాట్లాడారు. చేసిన పొరపాటును నెహ్రూ కొన్నిరోజులకు ఒప్పుకున్నారు. సింధూ నది జలాల ఒప్పందం కుదుర్చుకుంటే పాకిస్తాన్‌తో ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయని భావించానని, కానీ, అలా జరగలేదని ఒక సహచరుడితో అన్నారు. నెహ్రూ హయాంలో చేసిన తప్పిదాలను సరి చేస్తున్నాం’’ అని అన్నారు.
సరిపడా విదేశీ మారకద్రవ్య నిల్వలు
‘‘ఎస్‌అండ్‌పీ గ్లోబల్ రేటింగ్స్ సంస్థ ఇండియా క్రెడిట్ రేటింగ్‌ను ఇటీవల అప్‌గ్రేడ్ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ ప్రగతికి ఇదొక నిదర్శనం. దీనివల్ల మన దేశానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. జీఎస్టీలో తదుపరి తరం సంస్కరణలు తీసుకొస్తామని,
జీఎస్టీ రేట్లను సరళీకృతం చేస్తామంటూ
ఎర్రకోట నుంచి చేసిన ప్రకటనను స్టాక్‌మార్కెట్ స్వాగతించింది. సెన్సెక్స్ వరుసగా రెండు రోజులు ర్యాలీ చేసింది. మన ఆర్థిక వ్యవస్థ అత్యంత పటిష్టంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత రద్దీ ఎయిర్‌పోర్టుల్లో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ కూడా ఉంది. విదేశీ మారకద్రవ్య నిల్వలకు ఢోకా లేదు. సరిపడా నిల్వలు మన దగ్గర ఉన్నాయి’’ అని అన్నారు.
రాజకీయాలతో రాధాకృష్ణన్ ఆడుకోలేదు
‘‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్‌ను ఎంపిక చేయడం హర్షణీయం. ఆయన ఎంతో నిరాడంబరంగా జీవిస్తారు. దశాబ్దాలుగా ప్రజాసేవకు అంకితమయ్యారు. క్రీడల్లో ఆయనకు ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ రాజకీయాలతో ఏనాడూ ఆడుకోలేదు. రాధాకృష్ణన్‌తో నాకు నాలుగు దశాబ్దాలుగా అనుబంధం ఉంది. మాకు నల్లజుట్టు ఉన్నప్పటి నుంచి పరస్పరం మంచి పరిచయం ఉంది. ప్రజాసేవ అంటే ఆయనకు అమితమైన అనురక్తి. వివిధ స్థాయిలో ప్రజలకు సేవలందించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలో రాధాకృష్ణన్‌ను గెలిపించాలని అన్ని రాజకీయ పారీ్టలకూ విజ్ఞప్తి చేస్తున్నా. ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం. అందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరుతున్నా’’ అని అన్నారు.