
పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించి, కొడుకు ప్రాణాలు పోయేందుకు కారకురాలయ్యింది. తమకు చికెన్ డిష్ తినాలని అనిపిస్తున్నదని ఇద్దరు అన్నాచెల్లెళ్లు తల్లిని చెప్పారు. అయితే ఆమె అందుకు నిరాకరిస్తూ, రొట్టెల కర్రతో వారిని చితకబాదింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు మృతిచెందగా, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
పాల్ఘర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతిచెందిన బాలుడిని చిన్మయ్ ధుమ్డేగా పోలీసులు గుర్తించారు. తొలుత చిన్మయ్ తన తల్లి పల్లవి ధుమ్డే (40)ను చికెన్ డిష్ అడిగాడు. దీంతో ఆమె ఇప్పుడు కుదరదని చెబుతూ, రొట్టెల కర్రతో కుమారునిపై దాడి చేసింది. తర్వాత తన తన పదేళ్ల కుమార్తెను కూడా అదే రొట్టెల కర్రతో కొట్టింది. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి తన కుటుంబంతో కాశీపాడ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో ఉంటోంది. ఆమె కొట్టిన దెబ్బలకు కుమారుడు చిన్మయ్ గణేష్ ధుమ్డే (7) మృతిచెందాడు. 10 ఏళ్ల కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాల్ఘర్ పోలీసులు ఆ తల్లిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.