
సాక్షి,న్యూఢిల్లీ: నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. టోల్‌ప్లాజాల వద్ద గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుంటే టోల్ ఎందుకు చెల్లించాలి? అని ప్రశ్నించింది. వాహనదారులు నాలుగు వారాల పాటు టోల్ చెల్లించాల్సిన అవసరం లేదంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ ఎన్‌హెచ్‌ఏఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను గతవారం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇటీవల కేరళలోని త్రిసూర్ జిల్లా ఎడప్పల్లి - మన్నుత్తి 544 జాతీయ రహదారిలో ట్రాఫిక్ జామ్‌తో వాస్తవానికి 64 కిలోమీటర్లు దూరం గంటలో చేరుకోవచ్చు. కానీ ఆ గంట దూర ప్రయాణం కాస్తా..12 గంటల సమయం పట్టింది. దీనిపై స్థానిక మీడియా సైతం పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి. ట్రాఫిక్‌కు సంబంధించిన వీడియోలో, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. ట్రాఫిక్‌ను కేరళ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. వాహనదారులు నాలుగు వారాల పాటు టోల్ చెల్లించ వద్దని తీర్పును వెలువరించింది. పైగా.. వాహనదారులకే ఎన్‌ఎహెచ్‌ఏఐ నష్ట పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.
ఎన్‌హెచ్‌ఏఐపై ఆగ్రహం
కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కే. వినోద్ చంద్రన్, ఎన్వీ అంజరియాల ధర్మాసనం చేసిన ట్రాఫిక్ జామ్‌లో ప్రయాణికులు ఇబ్బందుల్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్‌హెచ్‌ఏఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇది యాక్ట్ ఆఫ్ గాడ్
ఎడప్పల్లి-మన్నుత్తి 544 జాతీయ రహదారిలో 12 గంటల ట్రాఫిక్ జామ్ అంటూ మీడియా కథనాల్ని హైలెట్ చేసింది. వాహనదారుడు 12గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుంటే టోల్ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించింది. అందుకు ఎన్‌హెచ్‌ఏఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్.. టోల్ ప్లాజావద్ద ట్రక్కు బోల్తా పడిందని, కాబట్టే ట్రాఫిక్ జామైందని తన వాదనలు వినిపించారు.
ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..రోడ్డు గుంతలే
మెహతా వాదనలకు.. ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు. రోడ్డు గుంతల కారణంగా వాహనం బోల్తా పడి ప్రమాదం జరిగింది. దానికి బాధ్యులు ఎవరు? అని జస్టిస్ చంద్రన్ రోడ్డు దుస్థితిని ఎత్తి చూపారు. అండర్‌పాస్‌లు నిర్మిస్తున్న ప్రదేశాలలో సర్వీస్ రోడ్లు ప్రత్యామ్నాయ మార్గాలను అందిస్తాయని, కానీ వర్షాకాలం రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడిందని తుషార్ మెహతా అన్నారు.
అలా ఎలా వసూలు చేస్తారు
ఆ సమయంలో ఎడప్పల్లి-మన్నుత్తి 544 టోల్ ప్లాజా వద్ద టోల్ విధింపుపై ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఆరా తీశారు. ట్రాఫిక్ లేకుండా 65 కిలోమీటర్ల రహదారి మార్గం ఒక గంట మాత్రమే పట్టే సమయం కాస్తా.. 12గంటల సమయం పట్టింది. అయినా సరే ఒక్కో వాహన దారుడు రూ.150 టోల్ ఛార్జీ ఎందుకు చెల్లించాలని ప్రశ్నించారు.
సొలిసిటర్ జనరల్ తన వాదనల్లో
సొలిసిటర్ జనరల్ తన వాదనల్లో గతంలో ఓ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం టోల్‌ఛార్జీలపై చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించారు. ఓ సందర్భంలో వాహనదారులు చెల్లించిన టోల్ ఫీజును తిరిగి చెల్లించకుండా..టోల్ ఛార్జీలను తగ్గించడమే సరైన పరిష్కారం అంటూ కోర్టు ఇప్పిన తీర్పును ఉదాహరించారు. అందుకు జస్టిస్ చంద్రన్ స్పందిస్తూ.. 12 గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వాహనదారుడికి ఎన్‌హెచ్‌ఏఐ చెల్లించాలి. ట్రాఫిక్ లేకపోతే.. 65 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు గంట సమయం పడుతుంది. ట్రాఫిక్ ఉంటే, గరిష్టంగా మూడు గంటలు పడుతుంది. కానీ ఇక్కడ 12 గంటల సమయం పట్టింది. ఈ ఘటనకు మీరు ఉదహరించిన ఘటనకు పొంతనలేదు’ పునరుద్ఘాటించారు.
జోక్యం చేసుకోలేం
ఇదే కేసు విచారణకు హాజరైన న్యాయవాదులు ఢిల్లీలో స్థానిక సంఘటనను ప్రస్తావిస్తూ.. ఎల్లప్పుడూ రద్దీగా ఉండే ఈ గేట్ ద్వారా కోర్టుకు చేరుకోవడానికి దాదాపు గంట సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఆందోళనకు సీజేఐ స్పందిస్తూ ‘ఢిల్లీలో ఏం జరుగుతుందో మాకు తెలుసు. రెండు గంటలు వర్షం పడితే, మొత్తం నగరం స్తంభించి పోతుందన్నారు. చివరకు కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము జోక్యం చేసుకోలేమంటూ తీర్పును రిజర్వ్ చేసింది దేశ అత్యున్నత న్యాయ స్థానం.
కేసు పూర్వాపరాల్ని పరిశీలిస్తే..
కేరళ ఎడప్పల్లి-మన్నుత్తి జాతీయ రహదారి (NH-544) చాలా దారుణంగా ఉంటుంది. గుంతల కారణంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం పడినప్పుడో లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో ఈ రహదారి మార్గంలో ప్రయాణించాలంటే వాహనదారులకు నిత్య నరకమే. అలాంటి రహదారిపై ఇటీవల భారీ ట్రాఫిక్ జామ్ తలెత్తింది. గంట ప్రయాణం కాస్తా.. 12గంటలు పట్టింది. ఇవేం పట్టించుకోని టోల్ నిర్వాహకులు వాహనదారుల నుంచి ముక్కుపిండి టోల్ ఛార్జీలు వసూలు చేశారు. ఈ వసూళ్లపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రోడ్లు అధ్వాన్నంగా ఉంటే టోల్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారని టోల్ యాజమాన్యాన్ని ప్రశ్నించించింది. నాలుగు వారాల పాటు టోల్ వసూలు చేయొద్దని సూచించింది.
కేరళ హైకోర్టు తీర్పుపై జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతలు చూసే ఎన్‌హెచ్‌ఏఐ.. నేషనల్ హైవే-544 టోల్ గేట్ సర్వీసులు నిర్వహించే గురువాయిర్ ఇన్‌ఫ్రాలు సుప్రీం కోర్టులో సవాలు చేశారు. ‘మేం ఒప్పందం ప్రకారం పని చేస్తున్నాం. రహదారి నిర్వహణ మా బాధ్యతే అయినా, ప్రజలు టోల్ చెల్లించకపోతే మాకు నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ఎన్‌హెచ్‌ఏఐ భరించాలని వాపోయాయి.
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. కేరళ హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు విముఖత వ్యక్తం చేసింది. అదే సమయంలో కోర్టులో పిటిషన్లు దాఖలు చేసి సమయం వృదా చేసే బదులుగా, రోడ్డు దుస్థితి గురించి నేషనల్ హైవే ఏదైనా చేయాలని కోర్టు పేర్కొంది. అటువంటి రద్దీ సమయంలో అంబులెన్స్‌లు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటాయని ఎత్తి చూపింది.