మహోజ్వల భారతి: సరెండర్‌ నాట్‌ బెనర్జీ 

Indian Political Leader Surendranath Banerjee Death Anniversary - Sakshi

సురేంద్రనాథ్‌ బెనర్జీ బ్రిటిష్‌ ఇండియా భారత రాజకీయాలలో ముఖ్య నాయకులు. ‘ఇండియన్‌ నేషనల్‌ అసోసియేషన్‌’ స్థాపకులు.  ‘ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌’ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. బెనర్జీ బెంగాల్‌ ప్రావిన్స్‌లోని కలకత్తాలో బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అతని తండి దుర్గా చరణ్‌ బెనర్జీ వైద్యులు, ఉదారవాద, ప్రగతిశీల ఆలోచనలు గలవారు. బెనర్జీపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉంది. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టా పొందిన తరువాత బెనర్జీ ఇండియన్‌ సివిల్‌ సర్వీస్‌ పరీక్షలను రాయడానికి ఇంగ్లండ్‌ వెళ్లారు. పరీక్షల్లో విజయం సాధించి సిల్‌హెట్‌లో (నేటి బంగ్లాదేశ్‌) అసిస్టెంట్‌ మేజిస్ట్రేట్‌గా నియామకం పొందారు. 1905లో బెంగాల్‌ ప్రావిన్స్‌ విభజనను నిరసించిన ముఖ్య ప్రజా నాయకులలో సురేంద్రనాథ్‌ బెనర్జీ కూడా ఉన్నారు. మితవాద రాజకీయ నాయకుల ప్రజాదరణ క్షీణించడం భారత రాజకీయాల్లో బెనర్జీ పాత్రను ప్రభావితం చేసింది. 1909 లో మింటో–మార్లే సంస్కరణలకు బెనర్జీ మద్దతు ఇచ్చారు. భారతీయ ప్రజా, జాతీయవాద రాజకీయ నాయకులలో చాలామందికి అది ఆగ్రహం కలిగించింది. అంతేకాదు, మహాత్మాగాంధీ ప్రతిపాదించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని బెనర్జీ విమర్శించడం, తర్వాత్తర్వాత బెంగాల్‌ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని అంగీకరించడం అనేకమంది జాతీయవాదులకు కోపం తెప్పించింది. అయినప్పటికీ భారత రాజకీయాల మార్గదర్శక నాయకుడిగా మొదట భారత రాజకీయ సాధికారత కోసం మార్గం నడపడం వల్ల బెనర్జీ చరిత్రలో గొప్ప నేతగా నిలిచిపోయారు. ‘సర్‌’ అనే బ్రిటిష్‌ హోదాకు అర్హులయ్యారు. బెనర్జీ చివరి రోజులలో బ్రిటిష్‌వారు ఆయన్ని ఆయన దృఢత్వానికి చిహ్నంగా ‘సరెండర్‌ నాట్‌’ బెనర్జీగా గౌరవించారు. బెనర్జీ తన 76 ఏళ్ల వయసులో 1925 ఆగస్టు 6న కన్నుమూశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top