రాజదండం సాక్షిగా... పార్లమెంటులో చోళుల సెంగోల్‌

Historic Sceptre Sengol To Be Placed In New Parliament Building - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంటు నూతన భవన ప్రారంభోత్సవం సందర్భంగా చోళుల నాటి ఓ పురాతన ఆచారానికి తిరిగి ప్రాణప్రతిష్ట జరగనుంది. అధికార బదిలీకి ప్రతీకగా శతాబ్దాల తరబడి చోళ రాజులు తమ వారసుని చేతికందిస్తూ వచ్చిన రాజదండాన్ని లోక్‌సభలో ప్రతిష్టించనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను సహచర మంత్రులు కిషన్‌రెడ్డి, అనురాగ్‌ ఠాకూర్‌లతో కలిసి బుధవారం ఆయన మీడియాకు వివరించారు. ‘‘సెంగోల్‌గా పిలిచే ఆ దండం నీతీ నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ ధర్మబద్ధంగా పాలన సాగిస్తామని చెప్పేందుకు ప్రతీక. నాడైనా నేడైనా సెంగోల్‌ ప్రతిష్టాపన వెనక ఉద్దేశం సుస్పష్టం. అధికార మార్పిడంటే కేవలం కరచాలనమో, దస్తావేజులపై సంతకాలో కాదు. ఆ ప్రక్రియ దేశ సంస్కృతీ సంప్రదాయాలతో లోతుగా ముడిపడి ఉండాలి. అదే సమయంలో ఆధునిక అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి. ప్రధాని మోదీ సుదూర ధర్మదృష్టికి  పార్లమెంటు నూతన భవనం ప్రతీక. అందులో సెంగోల్‌ కొలువుదీరడం సబబుగా ఉంటుందని ఆయన భావించారు’’ అని చెప్పారు. అలాగే పార్లమెంటు భవన నిర్మాణంలో పాలుపంచుకున్న శ్రమ యోగులైన 60 వేల మంది కార్మికులను కూడా ఈ సందర్భంగా మోదీ సన్మానిస్తారన్నారు.

ఆ అర్ధరాత్రి నెహ్రూ చేతికి...
‘‘1947 ఆగస్టు 14న జరిగిన అధికార బదిలీ ప్రక్రియకు తమిళనాడు నుంచి అధీనం పూజారి, గాయకుడు (ఒడువర్‌)తో పాటు నాదస్వర కళాకారుడు రాజారత్నం పిళ్లైని ప్రత్యేకంగా రప్పించారు. వారు ఆచారం ప్రకారం నిర్వహించాల్సన ప్రక్రియల నడుమ సెంగోల్‌ను తీసుకొచ్చారు. పూజారి దాన్ని లాంఛనంగా మౌంట్‌బాటెన్‌కు అందజేసిన అనంతరం పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. ఊరేగింపుగా నెహ్రూ నివాసానికి తీసుకెళ్లి ఆ సందర్భం కోసం ప్రత్యేకించిన గీతాలాపన నడుమ ఆయనకు అప్పగించారు. ఇదంతా ఆ రాత్రి వేళ చోటుచేసుకుంది. చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఎవరికీ పెద్దగా తెలియని ఈ వృత్తాంతంపై సమగ్రమైన పరిశోధనకు మోదీ ఆదేశించారు. ప్రజాస్వామ్య మందిరమైన పార్లమెంటులో సెంగోల్‌ను ప్రతిష్టించడం అత్యంత సబబుగా ఉంటుందని నిర్ణయించారు’’ అని అమిత్‌ షా తెలిపారు. నాటి సెంగోల్‌ తయారీలో పాలుపంచుకున్న వుమ్మిడి యతిరాజులు (96), వుమ్మిడి సుధాకర్‌ (88) కూడా 28న ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశముంది. సెంగోల్‌ను ఇప్పటికే అలహాబాద్‌ మ్యూజియం నుంచి ఢిల్లీ తరలించారు.
  
ప్రత్యేకతలెన్నో..
► పలు ప్రత్యేకతలు సెంగోల్‌ సొంతం. దీన్ని తమిళంలో ఆనై అని పిలుస్తారు.
► సెంగోల్‌ అనే పదం తమిళ పదమైన సెమ్మై నుంచి వచ్చింది.
► సెమ్మై అంటే ధర్మమని అర్థం.
► చోళుల హయాంలో సెంగోల్‌ను వెండితో తయారు చేసి బంగారు పూత పూసేవారు.
► సెంగోల్‌లోని ప్రతి చిహ్నానికీ నిగూఢమైన అర్థముంది. ఒక్కోటీ ఒక్కదానికి ప్రతీక.
► ఉదాహరణకు సెంగోల్‌పై ఉండే నంది న్యాయానికి ప్రతీక.
► చోళుల కాలంలో 7వ శతాబ్దం నాటి తమిళ సాధువు, కవి తిరుజ్ఞాన సంబంధర్‌ రాసి స్వరపరిచిన ప్రత్యేక గీతాలాపన నడుమ సెంగోల్‌ ప్రక్రియ సాగేదట.

 

 ప్రస్తుత సెంగోల్‌ది ఘనమైన నేపథ్యంలోక్‌సభలో ప్రతిష్టించనున్న సెంగోల్‌కు ఘనమైన నేపథ్యముందని అమిత్‌ షా వివరించారు. ‘‘బ్రిటిష్‌ వారినుంచి అధికార మార్పిడికి ప్రతీకగా చివరి గవర్నర్‌ జనరల్‌ లార్డ్‌ మౌంట్‌బాటెన్‌ 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి తొలి ప్రధాని నెహ్రూకు సెంగోల్‌నే అందజేశారు. అధికార మార్పిడికి ప్రతీకగా ఎలాంటి ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుందని మౌంట్‌బాటెన్‌ ఆరా తీయడంతో దీనికి బీజం పడింది. నెహ్రూ కోరగా చోళుల కాలంలో రాజు తన వారసునికి అధికారాన్ని బదలాయించేందుకు అనుసరించిన సెంగోల్‌ ప్రక్రియను రాజాజీ సూచించారు. 500 ఏళ్ల నాటి «‘తిరువావదుత్తరై అధీనం (మఠం)’ అధిపతి ద్వారా చెన్నైలో వుమ్మిడి బంగారు చెట్టి అనే నగర వ్యాపారిని పురమాయించి సెంగోల్‌ను తయారు చేయించారు’’ అని చెప్పారు.

 

(చదవండి: పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top