
ఢిల్లీ: భారత్- చైనా మధ్య సరిహద్దు వివాదాలు తగ్గించుకుంటున్న క్రమంలో తెరపైకి నేపాల్ వచ్చింది. లిపులేఖ్ కనుమ ద్వారా చైనాతో భారత్ సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించడంపై నేపాల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేపాల్ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ విషయంలో నేపాల్ వాదనలు అసమగ్రంగా ఉన్నాయని స్పష్టంచేసింది.
వివరాల ప్రకారం.. భారత్- చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణలను తగ్గించుకునేందుకు ఇరు దేశాలు చర్చల ద్వారా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో హిమాలయ పర్వత ప్రాంతం ఉత్తరాఖండ్‌లోని లిపులేఖ్ ప్రాంతం మీదుగా వాణిజ్య సరిహద్దులను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. దీనిపై నేపాల్ అభ్యంతరం తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ.. లిపులేఖ్ కనుమ ద్వారా భారత్, చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం 1954లో ప్రారంభమైంది.
దశాబ్దాలుగా వాణిజ్యం కొనసాగుతోంది. ఈ విషయంలో భారత్ వైఖరి స్పష్టంగా ఉంది. ప్రాదేశిక వాదనలను ఏకపక్షంగా విస్తరించడం సాధ్యం కాదు. వాణిజ్య మార్గంపై ఖాట్మండు ప్రాదేశిక వాదన అనుకూలమైనది కాదు. చారిత్రక వాస్తవాలు ఆధారంగా లేవు. కోవిడ్, ఇతర పరిణామాల కారణంగా వాణిజ్యానికి ఇటీవల సంవత్సరాల్లో అంతరాయం కలిగింది. ఇప్పుడు దానిని తిరిగి ప్రారంభించడానికి రెండు వైపులా అంగీకారం కుదిరింది. సరిహద్దు సమస్యలను పరిష్కరించడానికి దౌత్యం ద్వారా నేపాల్‌తో నిర్మాణాత్మక పరస్పర చర్యకు భారత్ సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు.
అయితే నేపాల్ పశ్చిమ సరిహద్దు లింపియాధురలో 56 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్ కనుమ ద్వారా సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి తెరవడానికి భారత్, చైనా ఇటీవల అంగీకరించాయి. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ భారత పర్యటన సందర్భంగా ఈ ఒప్పందం కుదిరింది. లిపులేఖ్, లింపియాధురతో సహా కాలాపానీ ప్రాంతం తమ భూభాగమని భారత్ తన వైఖరిని వ్యక్తం చేస్తోంది. కాగా, 1816 సుగౌలి ఒప్పందం ప్రకారం కాలాపానీ, లింపియాధురతో సహా లిపులేఖ్ తమకే చెందుతుందని నేపాల్ వాదిస్తోంది. ఆ ప్రాంతంలో రోడ్డు నిర్మాణం, రోడ్ల విస్తరణ, సరిహద్దు వాణిజ్యం వంటి ఎటువంటి కార్యకలాపాలను చేపట్టవద్దని నేపాల్ ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరుతోంది.