Video Viral: జెండా కొంటేనే రేషన్‌.. తీ​వ్ర విమర్శలు

Forced To Buy Flag To Get Ration, Allege Haryana Villagers - Sakshi

త్రివర్ణ పతాకానికి వెలకట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: దేశ ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జాతీయజెండాను రేషన్‌కార్డు పేద లబ్ధిదారులతో బలవంతంగా కొనుగోలుచేయిస్తున్న వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘రూ.20 పెట్టి జెండా కొనాల్సిందే. ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఆహారధాన్యాలు కావాలంటే జెండా కొనండి. లేదంటే వెళ్లండి’ అంటూ హరియాణాలోని కర్నాల్‌లో ఒక రేషన్‌ షాప్‌ డీలర్‌ కరాఖండీగా చెబుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ఈ ఘటనపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘జాతీయతను బీజేపీ అమ్మకానికి పెట్టింది. పేదల ఆత్మాభిమాన్ని గాయపరిచింది’ అని బీజేపీ సర్కార్‌ను విమర్శిస్తూ రాహుల్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌పెట్టారు.

వరుణ్‌ గాంధీ ఆగ్రహం
‘75వ స్వాతంత్య్రదినోత్సవాల వేళ ఇలాంటి ఘటన జరగడం సిగ్గుచేటు. చౌక సరకుల కోసం రేషన్‌ షాపుల వద్ద పడిగాపులు పడే పేద ప్రజల కష్టార్జితాన్ని ఇలా చిల్లరగా వసూలుచేయడం దారుణం. త్రివర్ణ పతాకానికి వెల కట్టడం శోచనీయం’ అని వరుణ్‌ గాంధీ హిందీలో ట్వీట్‌ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రంలో జాతీయ పండుగ పేదలకు భారంగా మారిందన్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలంతా తమ తమ ఇళ్ల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని ప్రధాని మోదీ పిలుపునివ్వడం తెల్సిందే. దీని అవకాశంగా తీసుకుని రేషన్‌ షాపుల వద్ద జెండాల వ్యాపారం చేయిస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేశారు.  

చదవండి: (ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలొస్తే.. బిహార్‌లో వారిదే హవా)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top