కొరొనిల్‌’ ప్రమోషన్‌పై దుమారం.. కేంద్రమంత్రిపై ఆగ్రహం

Coronil Controversy: IMA Demands Explanation from Union Minister - Sakshi

న్యూఢిల్లీ: పతాంజలి సంస్థ వ్యవస్థాపకుడు, యోగా గురు రామ్‌దేవ్‌ బాబా రూపొందించిన కరోనా మందు ‘కొరొనిల్‌’ ప్రమోషన్‌పై భారత వైద్య సంఘం (ఇండియన్‌ మెడికల్‌ ఆర్గనైజేషన్‌- ఐఎంఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి శాస్త్రీయ ఆధారం లేని మందుపై ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించింది. రామ్‌దేవ్‌ బాబా మందుపై కేంద్ర మంత్రులు ప్రచారం చేయడాన్ని తప్పుబట్టింది. తప్పుడు, అశాస్త్రీయ మందును ప్రజల ముందుకు ఎలా తీసుకొస్తారని నిలదీసింది.

కరోనాకు విరుగుడుగా పతాంజలి సంస్థ రూపొందించిన ‘కొరొనిల్‌’ మందును ఈనెల 19వ తేదీన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌, మరో మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో రామ్‌దేవ్‌ బాబా విడుదల చేశారు. ఫార్మాస్యూటికల్‌ ప్రొడక్ట్‌గా తమ మందుకు సర్టిఫికెట్‌ ఉందని, దీంతోపాటు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మరో సర్టిఫికెట్‌ ఉందని రామ్‌దేవ్‌ బాబా ప్రకటించారు. అయితే దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాము ఏ సర్టిఫికెట్‌ జారీ చేయలేదని ట్విటర్‌లో తెలిపింది. అయితే దీనిపై సోమవారం భారత వైద్యుల సంఘం స్పందించింది. కొరొనిల్‌ మందును తాము ఎలాంటి పరీక్షలు చేయలేదని భారత వైద్య సంఘం (ఐఎంఏ) తెలిపింది. తాము పరీక్షించని మందుకు ఫార్మాస్యూటికల్‌ ప్రొడక్ట్‌గా ఎలా గుర్తించినట్లు రామ్‌దేవ్‌ బాబా చెప్పుకుంటారని ఐఎంఏ ప్రశ్నించింది.

సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ముందు పచ్చి అబద్ధాలు రామ్‌దేవ్‌ బాబా చెప్పారని ఐఎంఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే రామ్‌దేవ్‌ బాబా చెప్పిన ప్రకటనపై కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ స్పందించకుండా ఎలా ఉంటారని ప్రశ్నించింది. కరోనాను ఏ సంప్రదాయక మందుకు తాము సర్టిఫికెట్‌ జారీ చేయలేదని ఈ సందర్భంగా ఐఎంఏ స్పష్టం చేసింది. వైద్యుడిగా ఉన్న కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ దీన్ని ఎలా సమర్ధిస్తారని మండిపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ తిరస్కరించిన మందును ఒక వైద్యుడిగా ఉన్న కేంద్రమంత్రి హర్షవర్ధన్‌ ఎలా సమర్ధించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాబా రామ్‌దేవ్‌ తీసుకొచ్చిన ఆ మందుకు అంత సామర్థ్యం ఉంటే రూ.32వేల కోట్లు ఖర్చు చేసి ఎందుకు వ్యాక్సినేషన్‌ చేస్తున్నారని ప్రశ్నించింది.

దీనిపై సమాధానం చెప్పాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను ఐఎంఏ డిమాండ్ ‌చేసింది. అయితే రామ్‌దేవ్‌ బాబా గతేడాదే ఈ మందును తీసుకువచ్చారు. అయితే ఈ మందు కరోనా నివారణకు పనికి రాదని, కేవలం రోగ నిరోధక శక్తి పెరగడానికి దోహదం చేసే మందుగా అమ్మాలని అప్పట్లో ఆయుశ్‌ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top