సీఓ2 ఎఫెక్ట్‌.. సముద్రమట్టాలు పైపైకి

CO2 Effect‌: Sea Levels Upwards - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వాతావరణంలో కార్బన్‌ డైయాక్సైడ్‌ మోతాదు అంతకంతకూ పెరిగిపోతున్న కారణంగా గత దశాబ్ద కాలంలో సముద్ర మట్టాలు ఏడాదికి సగటున 4.8 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయని అంతర్జాతీయ శాస్త్ర వేత్త డాక్టర్‌ అనీ కాజనేవ్‌ తెలిపారు. ఈ పెరుగుదల గత రెండు దశాబ్దాల కంటే ఎక్కువగా ఉందని, పైగా సముద్రమట్టాల పెరుగుదల రేటు కూడా పెరిగిందన్నారు. కౌన్సిల్‌ ఫర్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) అనుబంధ సంస్థ జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) 60వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ ప్రసంగంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ఐఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ప్రొఫెసర్‌ శేఖర్‌ సి మాండే, ఎన్‌జీఆర్‌ఐ డైరెక్టర్‌ వి.ఎం.తివారీ పాల్గొన్నారు.

సూర్యుడి నుంచి భూమిని చేరుతున్న శక్తి ఎక్కువగా ఉండటం, సూర్యరశ్మి రూపంలో మళ్లీ అంతరిక్షంలోకి మళ్లే శక్తి తక్కువ కావడం వల్ల భూతాపోన్నతి పెరుగుతున్న విషయం తెలిసిందే. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం, పచ్చదనం తగ్గిపోవడం వంటి కారణాలు భూతాపోన్నతి వేగాన్ని పెంచుతున్నాయని, 2010–2020 మధ్యకాలంలో వాతావరణంలో కార్బన్‌ డైయాక్సైడ్‌ మోతాదు రికార్డు స్థాయికి చేరడం గమనార్హమని డాక్టర్‌ అనీ కాజనేవ్‌ తెలిపారు. కరోనా కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఈ ఏడాది మార్చిలో కార్బన్‌ డైయాక్సైడ్‌ మోతాదు తగ్గినప్పటికీ ఆ తరువాత షరా మామూలుగా మారిపోయిందన్నారు.

భూమి సగటు ఉష్ణోగ్రతలు 1850–2019 మధ్యకాలంలో ఒక డిగ్రీ సెల్సియస్‌ వరకు పెరగ్గా, ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నాయని ఆమె వివరించారు. హిమనీనదాలు వేగంగా కరిగిపోతుండటం వల్ల సముద్ర మట్టాల పెరుగుదలలో వేగం ఎక్కువైందని చెప్పారు. 1900–1990 మధ్యకాలంలో ఇది 15 సెంటీమీటర్లుగా ఉందని, ఆ తరువాత కాలంలో ఉపగ్రహాల సాయంతో సముద్రమట్టాలపై జరిపిన పరిశీలన కూడా ఇదే తీరులో కొనసాగుతోందన్నారు. 

Election 2024

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top